Vidya Vasula Aham: రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే?

రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ నటించిన చిత్రం ‘విద్య వాసుల అహం’. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా రివ్యూ మీ కోసం..

Updated : 17 May 2024 17:41 IST

చిత్రం: విద్య వాసుల అహం; తారాగణం: రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌, అవసరాల శ్రీనివాస్‌, అభినయ, కాశీ విశ్వనాథ్‌, రూపా లక్ష్మి తదితరులు; సంగీతం: కల్యాణి మాలిక్‌; ఛాయాగ్రహణం: అఖిల్‌ వల్లూరి; కూర్పు: సత్య; నిర్మాతలు: నవ్య మహేశ్‌ ఎం., రంజిత్‌ కుమార్‌, చందన; కథ, మాటలు: వెంకటేశ్‌ రౌతు; స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌: మణికాంత్‌ గెల్లి.

రాహుల్‌ విజయ్‌ (Rahul Vijay), శివానీ రాజశేఖర్‌ (Shivani Rajashekar) జంటగా దర్శకుడు మణికాంత్‌ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్య వాసుల అహం’ (Vidya Vasula Aham). థియేటర్లలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల నేరుగా ఓటీటీ ‘ఆహా’ (Aha)లో శుక్రవారం రిలీజైంది. మరి, ఈ మూవీ ఎలా ఉంది? విద్య, వాసుల కథేంటి? తెలుసుకుందాం (Vidya Vasula Aham Review).

కథేంటంటే?: విశాఖపట్నానికి చెందిన వాసు (రాహుల్‌ విజయ్‌) మెకానికల్‌ ఇంజినీర్‌. తనకు ఇష్టం లేకపోయినా తల్లి కోరిక మేరకు వివాహం చేసుకునేందుకు అంగీకరిస్తాడు. మరోవైపు, అదే సిటీలో ఉండే విద్య (శివానీ రాజశేఖర్‌).. తన తల్లి పదేపదే పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ఓ కండిషన్‌తో సరేనంటుంది. తాను పెట్టిన పరీక్షలో పాస్‌ అయిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాననేదే ఆ షరతు. సంబంధాలు కుదిర్చే వ్యక్తి వద్ద సంబంధిత దరఖాస్తు చూసి వాసు ఆశ్చర్యపోతాడు. విద్య ఫొటో కూడా చూడకుండా అందులోని ప్రశ్నకు సమాధానాలిస్తాడు. టెస్ట్‌లో మంచి మార్కులు రావడంతో విద్య.. వాసు వివాహబంధంతో ఒక్కటవుతారు. కొంతకాలం ప్రశాంతంగా ఉన్న వారి జీవితంలో కలహాలు మొదలవుతాయి. ఎవరి అహం వల్ల ఏం జరిగింది? ఉద్యోగానికి రాజీనామా చేశాడని తెలిసిన వాసు తల్లిదండ్రులు, అత్తమామలు ఎలా స్పందించారు? విద్య, వాసులు మళ్లీ దగ్గరయ్యారా? అన్నదే మిగతా కథ (Vidya Vasula Aham Review in Telugu).

ఎలా ఉందంటే?: కొత్తగా పెళ్లైన జంటల మధ్య ప్రేమే కాదు గిల్లికజ్జాలు, చిన్నచిన్న గొడవలూ ఉండడం సహజం. ఈనేపథ్యంతో ఎన్నో కథలు తెరకెక్కి, మంచి విజయాన్ని అందుకున్నాయి. రొమాన్స్‌, ఫన్‌, ఎమోషన్‌.. ఇలా అన్ని హంగులూ ఉండే ఇలాంటి సినిమాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి నెలకొంటుంది. ఈ ‘విద్య వాసుల అహం’ ఆ కోవకు చెందిందే. ఇందులో అహం ప్రధానాంశం అని టైటిల్‌ బట్టి అర్థం చేసుకోవచ్చు. దీంతో, ఇగో వల్ల హీరోహీరోయిన్ల మధ్య దూరం ఏర్పడుతుందనే అంచనాకు ప్రేక్షకుడు వచ్చేస్తాడు. అయితే, దాన్ని ఎంత ఆసక్తిగా మలిచారన్న దానిపై సినిమా సక్సెస్‌ ఆధారపడి ఉంటుంది. ఈ చిత్రం విషయంలో ఆ మ్యాజిక్‌ జరగలేదు. సింపుల్‌గా తేల్చేశారు. భార్యా భర్తల నడుమ పంతాలు పట్టింపులు గురించి శ్రీమహా విష్ణువు, లక్ష్మీదేవి, నారదుడు చర్చించుకోవడం వంటి పౌరాణిక సన్నివేశాలతో చిత్రాన్ని ప్రారంభించడం బాగుంది. అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. నాయకానాయికల పరిచయం, వారి పెళ్లి చూపులు తదితర సన్నివేశాలు సరదాగా సాగుతాయి. లాజిక్స్‌ మిస్‌ అయినా కొన్ని నవ్వులు పంచుతాయి. సంభాషణలు ప్రాసలతో నిండిపోయాయి (Vidya Vasula Aham Review in Telugu).

సీరియస్‌ మోడ్‌లో సెకండాఫ్‌ని డీల్‌ చేశారు. కానీ, భావోద్వేగాలు కొరవడ్డాయి. ఇగో వల్ల హీరోహీరోయిన్లు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారో దాన్ని తమ పేరెంట్స్‌కి తెలియజేసి, వాళ్ల అనుభవంతో సలహాలు ఇప్పించడం లాంటివి చేసి ఉంటే ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉండేది. క్లైమాక్స్‌ సంతృప్తినిస్తుంది. నిడివి (1:40 గం) కూడా కొంత రిలీఫ్‌ ఇచ్చే అంశమే.

ఎవరెలా చేశారంటే?: ఈతరం అమ్మాయిల ఆలోచనలను ప్రతిబింబించే దివ్య పాత్రలో శివాని ఒదిగిపోయారు. గత సినిమాల్లో కంటే గ్లామర్‌గా కనిపించారు. కళ్లతో హావభావాలు పలికించి ఆకట్టుకున్నారు. వాసు క్యారెక్టర్‌కు రాహుల్‌ విజయ్‌ సరైన ఎంపిక అనిపించుకున్నారు. వీరిద్దరికే స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఎక్కువ. విష్ణువుగా అవసరాల శ్రీనివాస్‌, లక్ష్మీదేవిగా అభినయ, నారదుడిగా శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మిగిలినవారు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక బృందం విషయానికొస్తే.. కల్యాణి మాలిక్‌ అందించిన నేపథ్య సంగీతం అలరిస్తుంది. పాటలు పెద్దగా ప్రభావం చూపలేదు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త శ్రద్ధ చూపాల్సింది. మణికాంత్‌ గెల్లి టేకింగ్‌, నిర్మాణ విలువలు ఓకే (Vidya Vasula Aham Review).

కుటుంబంతో కలిసి చూడొచ్చా?: ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రమిది. అసభ్య పదజాలం, సన్నివేశాలు లేవు. ట్విస్ట్‌లు, కమర్షియల్‌ హంగులు అవసరం లేదు అనుకుంటే ఈ సినిమాని ట్రై చేయొచ్చు.

  • బలాలు
  • + శివానీ రాజశేఖర్‌ నటన
  • + అక్కడక్కడా కామెడీ 
  • బలహీనతలు
  • -  ప్రథమార్ధంలో సాగదీత 
  • - కొరవడిన భావోద్వేగాలు 
  • చివరిగా: విద్య, వాసుల అహం.. కొంత హాస్యానికే!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని