Vyavastha Review: రివ్యూ: వ్యవస్థ (వెబ్‌సిరీస్‌).. హెబ్బా పటేల్‌ హత్య చేసిందా?

హెబ్బా పటేల్‌, కార్తిక్‌ రత్నం, సంపత్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌ ‘వ్యవస్థ’. ‘జీ 5’లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 28 Apr 2023 17:04 IST

Vyavastha Review; వెబ్‌సిరీస్‌: వ్యవస్థ; నటీనటులు: కార్తిక్‌ రత్నం, హెబ్బా పటేల్‌, సంపత్‌రాజ్, కామ్నా జఠ్మలాని, గురురాజ్‌, రామారావు జాదవ్‌ తదితరులు; ఛాయాగ్రహణం: అనిల్‌ బండారి; సంగీతం: నరేశ్‌ కుమరన్‌; దర్శకత్వం: ఆనంద్ రంగా; నిర్మాత: పట్టాభి ఆర్. చిలుకూరి; దర్శకత్వం: ఆనంద్‌ రంగా; ఓటీటీ వేదిక: ZEE5

ప్రతివారం.. సినిమాల్లానే కొత్త వెబ్‌సిరీస్‌లూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అలా ఈ వారం వచ్చిన సిరీస్‌ల్లో ‘వ్యవస్థ’ (Vyavastha) ఒకటి. కార్తిక్‌ రత్నం (karthik rathnam), హెబ్బా పటేల్‌ (Hebah Patel), సంపత్‌రాజ్‌ (Sampath Raj) తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆనంద్‌ రంగా (Anand Ranga) తెరకెక్కించిన ఈ సిరీస్‌ కథేంటి? ఎలా ఉందంటే?(Vyavastha Web Series Review)..

ఇదీ కథ: యామిని (హెబ్బా పటేల్‌), అజయ్‌ నూతన దంపతులు. కొత్త పెళ్లికొడుకు శోభనం గదిలోకి వెళ్లగానే తుపాకీ పేలిన శబ్దం రాగా బంధువులు, పని మనుషులు కంగారు పడి తలుపులు తెరిచి లోపలికి వెళ్తారు. రక్తపు మడుగులో ఉన్న అజయ్‌ మృతదేహాన్ని, యామిని చేతిలో గన్‌ చూసిన వాళ్లంతా షాక్‌ అవుతారు. సమాచారం అందిన పోలీసులు యామినిని అరెస్ట్‌ చేస్తారు. కేసు నుంచి బయటపడేందుకు సీనియర్‌ లాయర్‌ అవినాష్‌ చక్రవర్తి (సంపత్‌ రాజ్‌)ని యామిని ఫ్యామిలీ సంప్రదిస్తుంది. అయితే, కోర్టు వాదనలో భాగంగా తన తరఫు న్యాయవాదిని మార్చుకుంటున్నానని ట్విస్ట్‌ ఇస్తుంది యామిని. ఆమెకు న్యాయం చేసేందుకు వంశీకృష్ణ (కార్తిక్‌ రత్నం) రంగంలోకి దిగుతాడు. తనను కాదన్న యామినిపై లాయర్‌ చక్రవర్తి ఎలా పగ తీర్చుకున్నాడు? యామినితోపాటు వంశీ కూడా ఆ కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు? యామినికి అతడు న్యాయం చేశాడా?అసలు అజయ్‌ను చంపిందెవరు?.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం సిరీస్‌ చూసి తెలుసుకోవాల్సిందే (Vyavastha Review).

ఎలా ఉందంటే? ఒకప్పటి కంటే ఇప్పుడు కోర్టురూమ్‌ డ్రామా కథలు విరివిగా తెరకెక్కుతున్నాయి. ఒకే జానర్‌లో ఎన్ని సినిమాలు/సిరీస్‌లొచ్చినా కొత్తదనం ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ‘వ్యవస్థ’ టీమ్‌ ముందడుగేసింది. కానీ, వైవిధ్యాన్ని చూపించలేకపోయింది. హీరోయిన్ తమ తొలిరాత్రే భర్తను ఎందుకు చంపాల్సి వచ్చింది? వారి మధ్య ఏం గొడవలున్నాయి? ఆమెకు శిక్ష పడుతుందా?.. ఇలా తొలి ఎపిసోడ్‌ ప్రారంభ సన్నివేశాలు ఉత్సుకత రేకెత్తించినా తర్వాతర్వాత కథలో వేగం తగ్గిపోతుంది. ‘నా పేరు కావాలంటే 32వ పేజీలో చూడండి.. అది ఓపెన్‌ చేస్తే నా పేరు కావాలంటే 64వ పేజీలో చూడండి’ అని చిన్నారులు ఆడుకున్నట్టే.. ఆ రూమ్‌లో ఏం జరిగింది? యామినితోపాటు ఇంకెవరైనా ఉన్నారా? తదితర ఆసక్తికర అంశాలను తదుపరి ఎపిసోడ్‌లో చూపిస్తారేమో అనుకుంటూ 8వ ఎపిసోడ్‌ వరకు దర్శకుడు ప్రేక్షకుల్ని లాక్కెళ్లారు. యామిని లైఫ్‌స్టైల్‌ ఏంటి? అజయ్‌ని ఎందుకు పెళ్లి చేసుకుంది?అజయ్‌ నేపథ్యమేంటి?ప్రధానమైన ఇలాంటి అంశాలను ఎలివేట్‌ చేసుంటే సిరీస్‌ ఉత్కంఠభరితంగా ఉండేది. కోర్టురూమ్‌ డ్రామా కథలనగానే కీలక కేసు విషయమై ఇద్దరు న్యాయవాదులు తమ తమ క్లైయింట్‌ల తరఫున పోటాపోటీగా వాదిస్తారని, కేసుకు సంబంధించి పూర్వపరాలను పరిశీలించి చిక్కుముడులు విప్పుతుంటారని అని అనుకోవడం సహజం. ఈ సిరీస్‌లో అది లోపించింది. అసలు విషయాన్ని పక్కనపెట్టి అవినాష్‌ చక్రవర్తి బ్యాక్‌గ్రౌండ్‌ని హైలైట్‌ చేశారు (Vyavastha Review).

‘చెక్‌మేట్‌’ పేరుతో ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం, తనకు వ్యతిరేకంగా ఉన్న వారి కేసులను ఇతర లాయర్లు ఎవరూ వాదించకుండా అందర్నీ తన గుప్పిట్లోకి తీసుకోవడం.. ఇలా చక్రవర్తి ఎలివేషన్‌ సీన్లతోనే దాదాపు సిరీస్‌ అంతా సాగుతుంది. అతడి గ్యాంగ్‌ గురించీ ఎక్కువగా ప్రస్తావిస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. న్యాయం పేరుతో అన్యాయంగా వ్యవహరించే అలాంటి లాయర్‌పై గెలిచేందుకు వంశీకృష్ణలాంటి జూనియర్‌ లాయర్‌ రంగంలోకి దిగడం, యామిని కేసు విషయంలో ఎత్తుకు పైఎత్తు వేసే సీన్లు ఫర్వాలేదనిపిస్తాయి. తమ మధ్య ఎలాంటి సంబంధం లేకుండా ఉండి ఉంటే యామినికి వంశీ సాయం చేయడమనేది అర్థవంతంగా ఉండేది. వీరిద్దిరికి ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ట్రాక్‌ నడపడంతో కథ బలం కోల్పోయినట్టైంది. అంత నిజాయతీగా ఉండే హీరో.. బంధం కోసమే పోరాడినట్టు అనిపిస్తుంది. అవినాష్‌ భార్య గాయత్రి (కామ్నా జఠ్మలాని) విదేశంలో ఉన్న తన కూతురికి ఫోన్‌ చేసి ‘చెక్‌మేట్‌’ బాధ్యతలు తీసుకునే సమయం వచ్చిందని చెప్పే క్లైమాక్స్‌ సీన్‌.. మరో సిరీస్‌ ఉంటుందేమో అనిపించేలా చేస్తుంది. మరి, మరో ‘వ్యవస్థ’ వస్తుందా?అంటే వేచి చూడాల్సిందే (Vyavastha Review).

ఎవరెలా చేశారంటే? ‘కేరాఫ్‌ కంచరపాలెం’, ‘నారప్ప’ తదితర హిట్‌ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్‌ రత్నం ఇందులోనూ సత్తా చాటాడు. జూనియర్‌ లాయర్‌ వంశీకృష్ణగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నెగెటివ్‌ రోల్స్‌తో మెప్పించిన సంపత్‌రాజ్‌ తనదైన శైలిలో నటించి చక్రవర్తి పాత్రకు జీవం పోశారు. హెబ్బాపటేల్‌ కీలక పాత్ర పోషించినా అభినయానికి స్కోప్‌ లేదు. ‘రణం’, ‘బెండు అప్పారావు’ తదితర చిత్రాల్లో మెరిసిన కామ్నా జఠ్మలాని ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. గాయత్రిగా అంత ప్రభావం చూపలేకపోయారు. ఈ సిరీస్‌కు నేపథ్య సంగీతం ప్రధాన బలం. ఛాయాగ్రహణం ఓకే. ఎడిటింగ్‌ విషయంలో మరింత శ్రద్ధ చూపించాల్సింది. ‘ఓయ్‌’ సినిమాతో ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ అందించిన దర్శకుడు ఆనంద్‌ రంగ ఈ సిరీస్‌కు న్యాయం చేయలేకపోయారు (Vyavastha Review).

బ‌లాలు: + కార్తిక్‌రత్నం, సంపత్‌ రాజ్‌ల నటన, + కోర్టులో కొన్ని సన్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు: - కథ; కథనం

చివ‌రిగా:  సీనియర్‌, జూనియర్‌ లాయర్ల మధ్య పోటీ ఈ ‘వ్యవస్థ’.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని