Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

సిద్ధార్థ్‌ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను అలరించిందా..?

Updated : 15 Mar 2024 16:41 IST

Yodha Movie Review in telugu చిత్రం: యోధ‌; నటీనటులు: సిద్ధార్థ్‌ మల్హోత్రా, రాశీఖన్నా, దిశాపటానీ, రోనిత్‌ రాయ్‌, తనూజ్ విర్వానీ, తదితరులు; ఎడిటింగ్‌: శివకుమార్‌ వి.పనికర్‌; సంగీతం: జాన్ స్టీవర్ట్ ఎడూరి; సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్యజీ; నిర్మాతలు: హిరూ యశ్‌ జోహర్‌, కరణ్‌ జోహర్‌, నిర్మాణ సంస్థలు: అమెజాన్‌ ఎంజీఎం స్టూడియోస్‌, ధర్మ ప్రొడెక్షన్స్‌; రచన: సాగర్ ఆంబ్రే; దర్శకత్వం: సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓఝా; విడుదల తేదీ: 15-03-2024

ఈ వారం హిందీ నుంచి వ‌చ్చిన ప్ర‌ధాన చిత్రాల్లో ఒక‌టి ‘యోధ‌’ (Yodha Movie Review). యాక్ష‌న్ క‌థ‌ల్లో బాగా ఒదిగిపోతాడ‌నే పేరున్న సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఇందులో క‌థానాయ‌కుడు. ‘షేర్‌షా’ త‌ర్వాత ఆయ‌న మ‌రోసారి క‌మాండోగా న‌టించిన చిత్రమిదే. హైజాక్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ఎలాఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం (Yodha Movie Review).

క‌థేంటంటే: త‌న తండ్రి సురేంద్ర క‌టియాల్ (రోనిత్ రాయ్‌) స్ఫూర్తితో యోధా టాస్క్‌ఫోర్స్‌లో క‌మాండోగా చేర‌తాడు అరుణ్ క‌టియాల్ (సిద్ధార్థ్ మ‌ల్హోత్రా). దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఆప‌రేష‌న్స్‌లో పాల్గొన‌డం అరుణ్ శైలి. ఆ క్ర‌మంలో కొన్నిసార్లు నిబంధ‌న‌ల్ని కూడా అతిక్ర‌మిస్తుంటాడు. ఆయ‌న భార్య ప్రియంవ‌ద క‌టియాల్ (రాశీఖ‌న్నా) కేంద్రప్ర‌భుత్వంలో ఉన్నతోద్యోగి. అరుణ్ చేప‌ట్టిన ఓ ఆప‌రేష‌న్ ఫెయిల్ కావ‌డంతో ప్ర‌సిద్ధ శాస్త్ర‌వేత్త అయిన అనుజ్ నాయ‌ర్ ప్ర‌యాణిస్తున్న విమానం హైజాక్‌కి గురికావ‌డంతో, ఉగ్ర‌వాదుల చేతుల్లో ఆయ‌న దారుణ హ‌త్య‌కి గుర‌వుతాడు. అదంతా స‌మ‌న్వ‌యలోపంతో జ‌రిగింద‌ని, అరుణ్‌ త‌న వాద‌న‌ని వినిపిస్తాడు. ఆ ఆపరేషన్‌ ప్రభావం అరుణ్‌, ప్రియంవ‌ద వైవాహిక జీవితంపై పడుతుంది. ఆ సంఘ‌ట‌న త‌ర్వాత యోధ టాస్క్‌ఫోర్స్ భ‌విత‌వ్యమే ప్ర‌శ్నార్థ‌కం అవుతుంది. ఆ త‌ర్వాత కొత్త బాధ్య‌త‌ల్ని చేప‌ట్టిన అరుణ్ క‌టియాల్‌ ఎయిర్ క‌మాండోగా దిల్లీ నుంచి లండ‌న్ వెళ్లే విమానం ఎక్కుతాడు. ఆ స‌మ‌యంలో ఇస్లామాబాద్‌లో ఇండియా, పాక్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతుంటాయి. ఆ చ‌ర్చ‌ల్ని టార్గెట్ చేసిన ఉగ్ర‌వాదులు అరుణ్ ప్ర‌యాణిస్తున్న విమానాన్ని హైజాక్ చేసి దారి మ‌ళ్లించేందుకు ప్లాన్ చేస్తారు. అరుణ్ పేరుని వాడుకుంటూ హైజాక్‌ని పూర్తి చేయాల‌నేది ఉగ్ర‌వాదుల ఎత్తుగ‌డ. ఎంతో ప‌క‌డ్బందీగా ప్లాన్ చేసి ఈ హైజాక్ కుట్ర‌ని అరుణ్ ఎలా ఛేదించాడు?ఉగ్రవాదుల కుట్ర‌ల‌ని ఎలా తిప్పికొట్టాడ‌నేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే: ఈమ‌ధ్య ఏరియ‌ల్ యాక్ష‌న్ క‌థ‌ల‌పై మ‌క్కువ ప్ర‌ద‌ర్శిస్తోంది భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌. ‘ఫైట‌ర్’, ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్’ త‌ర్వాత ఆ జోన‌ర్‌లో రూపొందిన మ‌రో చిత్ర‌మిది. కాక‌పోతే ఆ సినిమాల్లో యుద్ధాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. ‘యోధ‌’ అందుకు భిన్నంగా విమానంలో సాగే హైజాక్, యాక్ష‌న్ చిత్రం. దేశ‌భ‌క్తి కోణం, విభిన్న‌మైన యాక్ష‌న్‌ సన్నివేశాలు ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ, వాట‌న్నిటికంటే కూడా మ‌లుపులు ఈ సినిమాకి  ప్ర‌ధాన‌బ‌లం. హీరో యోధ టాస్క్‌ఫోర్స్‌లో చేర‌డం, తొలి ఆప‌రేష‌న్ విజయ‌వంతంగా పూర్తి చేయ‌డం వంటి సన్నివేశాల‌తో సినిమా ఆరంభ‌మ‌వుతుంది. శాస్త్ర‌వేత్త ఎపిసోడ్ నుంచే క‌థ‌లో ఉత్కంఠ మొద‌ల‌వుతుంది. శాస్త్ర‌వేత్త‌ని కాపాడేందుకు అరుణ్ చేసే ప్ర‌య‌త్నం ఆస‌క్తి రేకెత్తిస్తుంది. కానీ అది ఫెయిల్ కావ‌డం నుంచి క‌థ‌లో డ్రామా మొద‌ల‌వుతుంది. అరుణ్ ఎయిర్ క‌మాండో అయ్యాక ఎదురయ్యే స‌వాళ్లు మ‌రింత ఆక‌ట్టుకుంటాయి. ఫ్లైట్‌లో హైజాక‌ర్లు ఎవ‌రున్నారో ఒక ప‌ట్టాన అర్థం కాదు. ఎలా హైజాక్ చేయ‌నున్నారనేది అంతుచిక్క‌దు. అలాంటి స‌వాళ్ల మ‌ధ్య క‌థానాయ‌కుడు చేసిన పోరాటం మెప్పిస్తుంది. ఊహించ‌ని రీతిలో హైజాక‌ర్లు తెర‌పైకి రావ‌డం క‌థ‌లో కీల‌క‌ంగా మారుతుంది. ఏరియ‌ల్ వ్యూతో కూడిన స‌న్నివేశాలు, విమానంలో పోరాట ఘ‌ట్టాలు మెప్పిస్తాయి. క‌శ్మీర్ ఉగ్ర‌వాద నేప‌థ్యం పాత సినిమాల్ని గుర్తు చేస్తాయి త‌ప్ప‌ అందులో కొత్త‌ద‌నం లేదు. విమానంలో ఉగ్ర‌వాదులు ఎవ‌ర‌నేది తెలిసిన‌ప్ప‌టి నుంచి క‌థ‌లో ఆక‌ర్ష‌ణీయ‌మైన స‌న్నివేశాలేవీ క‌నిపించ‌వు. దాంతో మిగ‌తా భాగ‌మంతా సాదాసీదాగా అనిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: సిద్ధార్థ్ మల్హోత్రా మ‌రోసారి త‌న‌లోని యాక్ష‌న్ హీరోని తెర‌పై పూర్తిస్థాయిలో ఆవిష్క‌రించాడు. యాక్ష‌న్ ఘ‌ట్టాల్లో ఆయన ప్ర‌తిభ మెప్పిస్తుంది. భావోద్వేగాలు పండించడంలో ఫర్వాలేద‌నిపిస్తాడు. రాశీ ఖన్నా ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో క‌నిపిస్తుంది. మ‌రో క‌థానాయిక దిశాపటానీ పాత్ర ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్యప‌రుస్తుంది. ఆమె చేసిన పోరాట ఘ‌ట్టాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. సన్నీ హిందూజా నెగెటివ్ షేడ్స్‌లో ఉన్న న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించాడు. రోనిత్ రాయ్ చేసింది చిన్న పాత్రే కానీ, గుర్తుండిపోతుంది. దర్శకులు సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓఝా మ‌లుపుల‌తో కూడిన క‌థ‌నం రాసుకున్న‌ప్ప‌టికీ, ప్రధాన క‌థాంశంతో మాత్రం ప్రేక్ష‌కుల‌కు కొత్త‌ద‌నాన్ని పంచ‌లేక‌పోయారు. పోరాట ఘ‌ట్టాలు, మాట‌లు సినిమాకి ప్ర‌ధాన‌ బ‌లం. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బ‌లాలు
  • + క‌థ‌లో మ‌లుపులు
  • సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, రాశీఖ‌న్నా
  • పోరాట ఘ‌ట్టాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - కొత్త‌ద‌నం లేని క‌థ
  • ఊహ‌కు అందే స‌న్నివేశాలు
  • చివ‌రిగా: యోధ‌.. కొన్ని మ‌లుపుల‌తో థ్రిల్ చేస్తాడు..!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని