Updated : 29 Mar 2021 07:12 IST

యూకేలో ఓరుగల్లు మహిళ తెలుగు ఉద్యమం

‘ఉఠో’ సంస్థకు యూకే పార్లమెంట్‌ పురస్కారం

ఈనాడు, వరంగల్‌: యూకేలో ఓరుగల్లు మహిళ చేపట్టిన తెలుగు ఉద్యమానికి అక్కడి పార్లమెంట్‌లో గుర్తింపు లభించింది. ఆమె అధ్యక్షురాలిగా ఉన్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు హిందూ ఆర్గనైజేషన్‌ (ఉఠో) ‘యూకే పార్లమెంట్‌ వీక్‌ యాక్టివిటీ ఆఫ్‌ది ఇయర్‌’ పురస్కారం గెలుచుకుంది. వరంగల్‌కు చెందిన హేమ ఎల్లాప్రగడ పదిహేనేళ్ల క్రితం యూకే వెళ్లి కుటుంబంతో స్థిరపడ్డారు. వార్విక్‌ విశ్వవిద్యాలయంలో చరిత్రపై పరిశోధన చేశారు. తెలుగు భాష పరిరక్షణకు అక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. యూకేలో సుమారు 50 వేల మంది తెలుగు వారు స్థిరపడినా.. అక్కడి జనరల్‌ సర్టిఫికెట్ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (జీసీఎస్‌ఈ)లో తెలుగు భాషకు చోటు దక్కలేదు. గుజరాతీ, హిందీ, తమిళం, పంజాబీ లాంటి పలు భారతీయ భాషలను జీసీఎస్‌ఈలో భాగంగా అక్కడి విద్యాలయాల్లో బోధిస్తున్నారు. తెలుగును కూడా చేర్చాలని హేమ ఎల్లాప్రగడ ఉద్యమం చేస్తున్నారు.
32 సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి..
జీసీఎస్‌ఈలో ఏదైనా భాషను చేర్చాలంటే యూకేలో ఆ భాషను మాట్లాడే జనాభా తగినంత మంది ఉండాలి. అప్పుడే అక్కడి పార్లమెంట్‌ దాన్ని ఆమోదిస్తుంది. 2011 జనాభా లెక్కల్లో అక్కడ తెలుగు వారు కేవలం 11వేల మంది మాత్రమే ఉన్నట్టు నమోదైంది. వాస్తవానికి 50 వేల మంది వరకూ ఉన్నా, తాము మాట్లాడుతున్న ప్రధాన భాష తెలుగని వారు జనాభా లెక్కల సమయంలో పేర్కొనకపోవడంతో నమోదు కాలేదు. 2021 జనాభా లెక్కల గణన ప్రక్రియ గతేడాది మొదలైంది. ఈసారి తెలుగు వాళ్లంతా తాము మాట్లాడే ప్రధాన భాష తెలుగేనని నమోదు చేయాలని హేమ.. ‘ఉఠో’ తరఫున ఉద్యమం మొదలుపెట్టారు. 32 తెలుగు సంఘాలను ఏకతాటిపైకి తెచ్చారు. తద్వారా తెలుగును విద్యాలయాల్లో ఒక సబ్జెక్టుగా చేర్చేలా కృషి చేస్తున్నారు. ఇలాంటి పోరాటాలకు అక్కడి ‘పార్లమెంట్ వీక్‌’ గుర్తింపునిస్తుంది. ఈ పోటీకి 8 వేల దరఖాస్తులు రాగా.. మొత్తం నాలుగు పురస్కారాలు వరించాయి. అందులో ‘వీక్‌ యాక్టివిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం ‘ఉఠో’కు దక్కింది. ఈ సందర్భంగా హేమ ‘ఈనాడు’తో మాట్లాడుతూ త్వరలో ప్రకటించబోయే జనాభా లెక్కల్లో మన వాళ్లు 50 వేల మంది వరకు ఉన్నట్లు తేలుతుందని, అప్పుడు తెలుగును ఒక సబ్జెక్టుగా చేర్చే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని