Updated : 23/05/2021 11:30 IST

Vaccine: టీకా వేసుకుంటే బీరు ఉచితం!

లాటరీ టికెట్, నగదు కూడా.. 
అమెరికాలో కురుస్తున్న తాయిలాల వర్షం 


సాధారణంగా ఏ దేశంలోనైనా ఎన్నికల వేళ ప్రజలను రాజకీయ పార్టీలు ‘ఉచిత’ హామీలతో ఆకట్టుకోవటం చూస్తుంటాం! కానీ అమెరికాలో ఇప్పుడు ఏ ఎన్నికలూ లేకున్నా ఉచిత పంపకాల కార్యక్రమం నడుస్తోంది. కారణం- కొవిడ్‌ టీకా! వ్యాక్సిన్లు వేసుకునేలా ప్రజల్ని ప్రోత్సహించటానికిగాను... ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలూ అనేక ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతీరుగా ఈ తాయిలాల వర్షం సాగుతోంది. 
మేలో వ్యాక్సిన్‌ వేసుకుంటే ఉచితంగా బీర్లు, వైన్‌ ఇస్తామని ఒకరంటే... మ్యూజియాలు, పార్కుల్లోకి ఉచిత ప్రవేశమని అని ఇంకొకరు... 50 లక్షల డాలర్ల లాటరీ టికెట్‌ ఉచితమని మరొకరు హామీ ఇస్తున్నారు. 25 డాలర్ల గిఫ్ట్‌ కూపన్లు, ఏడు రోజులు మెట్రోరైలులో ఉచిత ప్రయాణం కార్డు, వచ్చే ఏడాది సూపర్‌బౌల్‌ టికెట్లు... ఇలా అమెరికన్లపై టీకా కోసం తాయిలాలు ఇబ్బడిముబ్బిడిగా వచ్చి పడుతున్నాయి.

ఎందుకీ తాయిలాలు?

ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా టీకాలను సమకూర్చుకొని, వేగంగా ప్రజలకివ్వటం మొదలెట్టిన అమెరికాలో ఉన్నట్టుండి గత కొద్దివారాలుగా ఈ ప్రక్రియ మందగించింది. ఆ దేశ మొత్తం జనాభా సుమారు 33 కోట్లు. 16 కోట్ల మందికి కనీసం ఒక డోసు టీకా పూర్తయింది. సుమారు 12 కోట్ల మందికి (38%) రెండు డోసులూ ముగిశాయి. అత్యధికంగా ఏప్రిల్‌ 1న ఒక్కరోజే 40 లక్షల డోసులు వేశారు. కానీ ఆ తర్వాత నుంచి క్రమంగా టీకా వేసుకునేవారి సంఖ్య తగ్గుతోంది. ఈ నెల 17న కేవలం 10 లక్షల డోసులే వేశారు. దీంతో ప్రజల్ని టీకాల దిశగా ఆకట్టుకోవటానికి ప్రభుత్వం, కంపెనీలు కలసి ప్రోత్సాహకాలు ప్రకటించటం మొదలెట్టాయి.

గవర్నర్‌ దంపతులతో కలసి భోజనం 

న్యూయార్క్‌ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి... రాష్ట్ర గవర్నర్‌ దంపతులతో కలసి భోజనం చేసే ఆఫర్‌ ఇచ్చింది. ఇందుకోసం ఏకంగా ఓ ఆన్‌లైన్‌ పోటీయే మొదలెట్టింది!  ఇప్పటిదాకా టీకా వేసుకున్న 18 ఏళ్ల పైబడిన వారెవరైనా ఆన్‌లైన్‌లో తమ పేరు నమోదు చేసుకొని ఈ పోటీలో పాల్గొనవచ్చు. లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారికి గవర్నర్‌ దంపతులతో కలసి వారింట్లోనే భోజనం చేసే అవకాశం కల్పిస్తారు. 
అమెరికాలో ఇదీ పరిస్థితి.. 

> అమెరికాలో ఈ ఏడాది జనవరిలో సగటున రోజుకు 2.5 లక్షల కేసులు నమోదవగా... ప్రస్తుతం 35 వేలకుపైగా కేసులు వస్తున్నాయి. 

మరిన్ని తాయిలాలివీ.. 

బైడెన్‌ ప్రభుత్వం ఉబర్, లిఫ్ట్‌ రవాణా సంస్థలతో ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటంటే.. ఎవరైతే కరోనా టీకా వేయించుకోవటానికి వెళతారో వారిని ఆ సంస్థల వాహనాల్లో ఉచితంగా తీసుకెళ్లి, తీసుకొస్తారు. 

ఫిలడెల్ఫియాలోని కొన్ని కంపెనీలు టీకా తీసుకున్న తమ ఉద్యోగులకు 100 నుంచి 200 డాలర్లు ప్రోత్సాహకంగా చెల్లిస్తున్నాయి. సెప్టా అనే స్థానిక కంపెనీ 100 డాలర్లు; లిడిల్‌ అనే సూపర్‌ మార్కెట్‌ తమ ఉద్యోగులకు 200 డాలర్లు ప్రోత్సాహకాలుగా ప్రకటించాయి. 

షికాగోలో టీకా వేయించుకున్నవారికి ఈ వేసవిలో సాగే సంగీత విభావరులకు ఉచిత పాసులిస్తారు. 

కనెక్టికట్‌లోని రెస్టారెంట్లు... టీకాలు వేసుకున్నవారికి తమదగ్గర ఆహారం కొంటే పానీయాలు ఉచితమంటున్నాయి. 

న్యూజెర్సీలో ఈ నెలలోపు టీకా వేసుకున్న 21 ఏళ్ల పైబడినవారికి... ఎంపిక చేసిన షాపుల్లో ఉచితంగా బీర్లు అందనున్నాయి. 

వెస్ట్‌ వర్జీనియాలో టీకాలు వేయించుకున్న (16-35 సంవత్సరాల్లోపు) వారికి 100 డాలర్ల సేవింగ్‌ బాండ్లు ఇవ్వాలనుందని గవర్నర్‌ ప్రకటించారు. దీని సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారట! 

న్యూయార్క్‌లో 18 ఏళ్ల పైబడినవారు టీకా వేసుకుంటే వారికి 20 డాలర్ల విలువైన (50 లక్షల డాలర్ల బహుమతి) లాటరీ టికెట్‌ ఉచితంగా ఇస్తున్నారు.- ఈనాడు ప్రత్యేక విభాగం  

 

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని