
బాపూ విలువలకు పట్టం.. అమెరికా చట్టం
గాంధీ, మార్టిన్ లూథర్ బోధనలపై అధ్యయనానికి సహకారం
కొత్త బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం
వాషింగ్టన్: మహాత్మా గాంధీ విలువలకు పట్టం కట్టేలా అమెరికా ఓ కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రతినిధుల సభ శుక్రవారం ‘గాంధీ-కింగ్ స్కాలర్లీ ఎక్ఛేంజ్ ఇనిషియేటివ్’ బిల్లును ఆమోదించింది. దీని ద్వారా అమెరికా మేధావులు గాంధీపై అధ్యయనం చేయడానికి వనరులు సమకూర్చనుంది. అదే విధంగా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ బోధనలపై భారతీయ మేధావులు అధ్యయనం చేయడానికి సహకారం అందించనుంది. ఈ బిల్లు ద్వారా అమెరికా విదేశాంగ శాఖ.. భారత ప్రభుత్వంతో కలసి ఏటా రెండు దేశాల మేధావుల కోసం విద్యా సదస్సును నిర్వహించడానికి వీలు కలుగుతుంది. దీంతోపాటు ఘర్షణ వాతావరణాన్ని అహింస మార్గంలో పరిష్కరించేందుకు కావాల్సిన నైపుణ్యాలను నేర్పించే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, భారత్‌లోని సవాళ్లను పరిష్కరించే దిశగా ఓ సంస్థను ఏర్పాటు చేయడానికీ ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. గాంధీ-కింగ్ స్కాలర్లీ ఎక్ఛేంజ్ ఇనిషియేటివ్ కార్యక్రమానికి ప్రతి ఆర్థిక సంవత్సరానికి మిలియన్ డాలర్లు చొప్పున 2025 వరకూ అమెరికా నిధులు అందించనుంది. దీంతోపాటు గాంధీ-కింగ్ గ్లోబల్ అకాడెమీకి 2021 ఆర్థిక సంవత్సరంలో 2 మిలియన్ డాలర్లు, అదే ఏడాది యూఎస్-ఇండియా గాంధీ-కింగ్ డెవలప్మెంట్ ఫౌండేషన్‌కు 30 మిలియన్ డాలర్లు అందించనుంది.
100 రోజులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి: బైడెన్
అమెరికా ప్రజలందరూ 100 రోజుల పాటు తప్పకుండా మాస్కులు ధరించాలని అధ్యక్ష హోదాలో విజ్ఞప్తి చేస్తానని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పేర్కొన్నారు. జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశాక తాను ప్రజలకు చేసే తొలి విజ్ఞప్తి అదేనని బైడెన్ చెప్పారు. దీని ద్వారా దేశంలో విజృంభిస్తున్న కరోనా వ్యాప్తిని గణనీయంగా తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు.
ఫౌచీని అదే హోదాలో కొనసాగిస్తా
ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో ప్రధాన వైద్య సలహాదారుగా ఉన్న ఆంటోనీ ఫౌచీని అదే హోదాలో కొనసాగిస్తానని బైడెన్ వెల్లడించారు. దీంతోపాటు తన కొవిడ్ సలహాదారుల బృందంలోనూ స్థానం కల్పిస్తానని చెప్పారు. టీకాలపై ప్రజల్లో విశ్వాసం కల్పించే విషయంపై ఫౌచీతో చర్చించానని తెలిపారు. ఏదైనా టీకా సురక్షితమనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి తాను బహిరంగంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని బైడెన్ పేర్కొన్నారు.
అమెరికా సర్జన్ జనరల్‌గా వివేక్ కృష్ణమూర్తి!
బైడెన్ నియమించిన కొవిడ్ సలహాదారుల బృందంలో కీలక స్థానంలో ఉన్న ప్రముఖ భారతీయ అమెరికన్ వైద్యుడు వివేక్ కృష్ణమూర్తికి మరో అత్యున్నత పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రజారోగ్య వ్యవస్థలో అత్యున్నత హోదా అయిన సర్జన్ జనరల్‌గా వివేక్‌ను బైడెన్ ఎంచుకున్నట్లు సమాచారం. ఈమేరకు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆయన నియామకంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అందులో పేర్కొంది. కాగా వివేక్ గతంలో ఒబామా హయాంలోనూ అదే హోదాలో బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం.
ఇవీ చదవండి..
కరోనాపై బైడెన్ తొలి అస్త్రం ఇదే