‘మెహబూబా ముఫ్తీని వెంటనే అరెస్టు చేయాలి’

జమ్మూ-కశ్మీర్‌లో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మోహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై ఇటు భాజపా, అటు కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి........

Published : 24 Oct 2020 10:31 IST

త్రివర్ణ పతాకంపై ముఫ్తీ వ్యాఖ్యల్ని ఖండించిన భాజపా, కాంగ్రెస్‌

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మోహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై ఇటు భాజపా, అటు కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని భాజపా ఆరోపించింది. వెంటనే ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ భూమిపై ఏ శక్తీ జమ్మూ-కశ్మీర్‌లో తిరిగి ప్రత్యేక జెండాను ఎగురవేయలేదని వ్యాఖ్యానించింది. ముఫ్తీ వ్యాఖ్యల్ని గవర్నర్‌ తీవ్రంగా పరిగణించాలని భాజపా జమ్మూకశ్మీర్‌ శాఖ అధ్యక్షుడు రవీందర్‌ రైనా కోరారు. ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ముఫ్తీకి హితవు పలికారు. లేని పక్షంలో జరగబోయే పరిణామాలను ఆమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 

ముఫ్తీ వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని జమ్మూకశ్మీర్‌ పీసీసీ అధికార ప్రతినిధి రవీందర్‌ శర్మ అన్నారు. త్రివర్ణ పతాకం భారతీయుల ఐక్యత, సమగ్రత, త్యాగాలను చాటుతుందని.. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయొద్దన్నారు. ప్రజాస్వామ్య, చట్టబద్ధ పాలన కోసం పోరాడిన ఎంతో మంది త్యాగాలను కించపరిచినట్లవుతుందన్నారు. 

ఆర్టికల్‌ 370 రద్దుతో ఉనికి కోల్పోయిన జమ్మూ-కశ్మీర్‌ ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామని ముఫ్తీ శుక్రవారం అన్నారు. తమ జెండాను తిరిగి ఇచ్చేవరకు మరో జెండా ఎగురవేయమన్నారు. ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని