సంకీర్ణ ధర్మం కోసమే నాపై విమర్శలు: చిరాగ్‌

లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)తో తమకు ఎలాంటి సంబంధాల్లేవంటూ ఇటీవల భాజపా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాస్వాన్‌ స్పందించారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించేందుకు.......

Published : 19 Oct 2020 02:15 IST

పట్నా: లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)తో తమకెలాంటి సంబంధాల్లేవంటూ ఇటీవల భాజపా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాస్వాన్‌ స్పందించారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించేందుకు,  బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ను సంతృప్తి పరిచేందుకే ఆ పార్టీ అలాంటి వ్యాఖ్యలు చేస్తోందే తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.

‘‘నాన్న (రాంవిలాస్‌ పాస్వాన్‌) ఆస్పత్రిలో ఉన్నప్పటి నుంచి ఆయన అంత్యక్రియల వరకూ ప్రధాని మోదీ నాకెంతో చేశారు. ఆయన చేసిన మేలును మరిచిపోలేను. నా వల్ల ఆయన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంకీర్ణ ధర్మం కోసం, నీతీశ్‌ను సంతృప్తి పరిచేందుకు నన్ను ఆయన ఎన్ని మాటలన్నా పర్వాలేదు’’ అని చిరాగ్‌ అన్నారు. తాను మోదీ తరహా అభివృద్ధికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. ‘‘ఎల్జేపీకి, భాజపాను దూరం చేయడానికి నీతీశ్‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. భాజపా సైతం తమ మధ్య ఎలాంటి అవగాహన లేదని చెప్పేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. నీతీశ్‌ మీద కోపం ఉన్నా సంకీర్ణ ధర్మాన్ని పాటించాలన్న ఉద్దేశంతో నాకు రోజుకో సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. ఈ విషయంలో నీతీశ్‌.. తన మిత్రపక్షమైన భాజపాకు కృతజ్ఞతలు చెప్పాలి’’ అని చిరాగ్‌ చెప్పారు.

జేడీయూపై విభేదాల నేపథ్యంలో ఎన్డీయే నుంచి ఎల్జేపీ బయటకొచ్చి స్వతంత్రంగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జేడీయూకు పోటీగా అభ్యర్థులను నిలబెడుతోంది. అదే సమయంలో భాజపా అభ్యర్థుల నిల్చున్న స్థానాల్లో పోటీ చేయడం లేదు. అలాగే ఎన్నికల తర్వాత రాబోయేది భాజపా- ఎల్జేపీ ప్రభుత్వమేనని చిరాగ్‌ పాస్వాన్‌ పదే పదే చెబుతున్నారు. దీంతో ప్రజలను చిరాగ్‌ పాస్వాన్‌ గందరగోళ పరుస్తున్నారంటూ భాజపా మండిపడింది. ఎల్జేపీతో తమకు ఎలాంటి సంబంధాల్లేవని స్పష్టంచేసింది. దీనిపై చిరాగ్‌ ఈ విధంగా స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని