Navaneet Kaur: ఎంపీ నవనీత్‌ కౌర్‌కు బాంబే హైకోర్టు షాక్‌

మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్‌ కౌర్‌ రాణాకు బాంబే హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఎన్నికల్లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినందుకు గాను ఆమెకు రూ.2లక్షలు జరిమానా......

Updated : 08 Jun 2021 15:23 IST

ముంబయి: మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్‌ కౌర్‌ రాణాకు బాంబే హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఎన్నికల్లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినందుకు గాను ఆమెకు రూ.2లక్షలు జరిమానా విధించింది. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, ఫోర్జరీ ధ్రువీకరణ పత్రంతో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చింది. అలాగే, ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు సరైనవేనని రుజువు చేసుకొనేందుకు నెల పాటు గడువు ఇచ్చినట్టు సమాచారం. విదర్భ ప్రాంతంలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నవనీత్‌ కౌర్‌.. తొలిసారి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఆమె లోక్‌సభ సభ్యత్వం ప్రమాదంలో పడినట్లైంది. 

శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పార్లమెంట్ లాబీల్లో తనపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ మార్చిలో నవనీత్ కౌర్‌ ఆరోపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతామని హెచ్చరించారని తెలిపారు. తనపై యాసిడ్‌ దాడి చేస్తామంటూ ఫోన్‌ కాల్స్‌తో పాటు శివసేన లెటర్‌ హెడ్‌తో లేఖలు కూడా వస్తున్నాయంటూ నవనీత్‌ కౌర్‌.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. 

2019 ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానం నుంచి నవనీత్ కౌర్ శివసేన అభ్యర్థి ఆనందరావు అదసూల్‌ పైనే విజయం సాధించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన నవనీత్‌కౌర్‌.. ఎన్సీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అమరావతి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నవనీత్‌ కౌర్‌ పలు తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, తమిళం, మళయాలం, పంజాబీ చిత్రాల్లో కూడా నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని