మోదీ మంత్రి వర్గంలో ‘ఒకే ఒక్కడు’

ప్రధాని నరేంద్ర మోదీ భాజపాలో కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. 1999 తర్వాత 2014లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన భాజపా ఎన్డీయే కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్డీయే కూటమి 336 స్థానాలను సాధించగా యూపీఏ కేవలం 60 స్థానాలకే పరిమితమైపోయింది. అప్పటి నుంచి మోదీ ప్రభంజనం కొనసాగుతూనే....

Published : 10 Oct 2020 18:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీ కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత భాజపా అనూహ్యంగా పుంజుకుంది. 1999 తర్వాత 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన భాజపా ఎన్డీయే కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్డీయే కూటమి 336 స్థానాలను సాధించగా యూపీఏ కేవలం 60 స్థానాలకే పరిమితమైపోయింది. అప్పటి నుంచి మోదీ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడిచిన 2019 ఎన్నికల్లోనూ మోదీ హవా కొనసాగింది. దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించింది. మిత్రపక్షాల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ఆ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 353 స్థానాలు సాధించగా అందులో భాజపా గెలుపొందిన స్థానాలు 303. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం సాధించిన స్థానాలు కేవలం 91.

సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించినప్పటికీ కాషాయదళం మిత్ర పార్టీలను కలుపుతూ పోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత  మొత్తం 57 మంది మంత్రులతో ప్రధాని మోదీ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయగా అందులో 24 మంది కేబినెట్‌ మంత్రులు. వీరిలో భాజపాయేతరులు ముగ్గురు. అయితే రాజకీయ కారణావల్ల శివసేనకు చెందిన అరవింద్‌ సావంత్‌, శిరోమణి అకాళీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తాజాగా లోక్‌జన శక్తి పార్టీ నుంచి మంత్రిగా ఉన్న రామ్‌విలాస్‌ పాసవాన్‌ కన్నుమూయడంతో ఉన్న ఆ ఒక్క భాజపాయేతర కేబినెట్‌ మంత్రి కూడా లేనట్లయింది. దీంతో మొత్తం కేబినెట్‌ మంత్రుల సంఖ్య 21కి పడిపోయింది. కేబినెట్‌ విషయాన్ని పక్కన పెడితే మొత్తం మోదీ మంత్రి వర్గంలో ప్రస్తుతం ఒకే ఒక్క భాజపాయేతర మంత్రి ఉన్నారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి రామ్‌దాస్‌ అథవాలే తప్ప ఇతర పార్టీలకు చెందిన కేంద్ర మంత్రే లేకపోవడం గమనార్హం. ఆయన కూడా రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరోవైపు భాజపాకు మిత్ర పక్షాల సంఖ్య కూడా క్రమేపీ తగ్గుతూ వస్తోంది. చిరకాల మిత్రపార్టీ అయిన శివసేన రాజకీయ విభేదాలతో 2019 చివరిలో ఎన్డీయే నుంచి బయటకొచ్చి వేరే కుంపటి పెట్టుకుంది. అంతేకాకుండా ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని చెబుతూ శిరోమణి అకాళీదల్‌ వాటిని తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ అధికార భాజపా మాత్రం మొండిగా ముందుకెళ్లింది. ఈ నేపథ్యంలో మరో అతిపెద్ద మిత్రపక్షం శిరోమణి అకాళీదళ్‌ కూడా భాజపాకు దూరమైంది. మరో మిత్రపక్షం జేడీయూ కూడా కేంద్రమంత్రి పదవికి దూరంగా ఉంటోంది. బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంతో కలిసి పని చేస్తూనే రాష్ట్రంలో మాత్రం వ్యతిరేకంగా పోటీచేసేందుకు రామ్‌విలాస్‌ పాసవాన్‌ తనయుడు చిరాగ్‌ పాసవాన్‌ సమాయత్తమవుతున్నారు. అయితే అనూహ్య పరిణామాలు ఎదురైతే తప్ప అత్యధిక మెజారిటీ సాధించిన భాజపా స్థానానికి ఢోకా లేదనేది సుస్పష్టం. రాజ్యాంగం ప్రకారం మొత్తం 543 మంది లోక్‌సభ ఎంపీల్లో 15 శాతం అంటే 80 మంది వరకు మోదీ మంత్రివర్గంలో సభ్యులుగా చేర్చుకునే అవకాశముంది. పాసవాన్‌ మంత్రిగా ఉన్న వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా సరఫరా మంత్రిత్వశాఖ బాధ్యతలను రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు అప్పగిస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని