కమల్‌ను తొలగించే అధికారం ఈసీకి లేదు

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను ‘స్టార్‌ క్యాంపెయినర్‌’ జాబితా నుంచి తొలగిస్తూ ఎన్నికల కమిషన్‌(ఈసీ) ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ప్రచార నాయకుడిని

Published : 02 Nov 2020 14:17 IST

ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు

దిల్లీ: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను ‘స్టార్‌ క్యాంపెయినర్‌’ జాబితా నుంచి తొలగిస్తూ ఎన్నికల కమిషన్‌(ఈసీ) ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ప్రచార నాయకుడిని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. 

ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్‌ చేస్తూ కమల్‌నాథ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా.. మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ప్రచార సమయం ముగిసింది. మంగళవారం ఉప ఎన్నికలు జరగున్న నేపథ్యంలో కమల్‌నాథ్‌ పిటిషన్‌ చెల్లుబాటు కాదని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, పార్టీ ప్రచార నాయకుడు ఎవరో నిర్ణయించే అధికారం ఈసీకి ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని కమల్‌నాథ్‌ పిటిషన్‌లో పేర్కొనడంతో సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న సీజేఐ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఎన్నికల సంఘం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ ఎవరో నిర్ణయించే అధికారం ఎవరిచ్చారని ఈసీని ప్రశ్నించింది. ఆ అధికారం ఎన్నికల సంఘానికి లేదని స్పష్టం చేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఈసీకి నోటీసులు జారీ చేసింది.

ఇటీవల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా మహిళా అభ్యర్థిపై కమల్‌నాథ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలతో కమల్‌నాథ్‌ను స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా నుంచి ఈసీ తొలగించింది. కమల్‌నాథ్‌ ఏ నియోజకవర్గంలోనైనా ప్రచారానికి వెళ్తే ఆయన ప్రయాణఖర్చులు, వసతి తదితర ఖర్చులన్నీ సంబంధిత అభ్యర్థులే భరించాలని ఆదేశించింది. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని