Alla Ramakrishna Reddy: షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆమె వెంటే ఉంటా: ఆర్కే

వైతెపా అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌కు వెళ్లేది నిజమై అయితే.. తానూ ఆమె వెంటే నడుస్తానని ఇటీవల ఎమ్మెల్యే పదవికి, వైకాపా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వెల్లడించారు.

Updated : 30 Dec 2023 15:18 IST

మంగళగిరి: వైతెపా అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌కు వెళ్లేది నిజమే అయితే.. తానూ ఆమె వెంటే నడుస్తానని ఇటీవల ఎమ్మెల్యే పదవికి, వైకాపా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వెల్లడించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘నేను ఏ పార్టీలో ఉంటాననేది కాలమే నిర్ణయిస్తుంది. వైకాపాకు నేను ఎంత సేవ చేశానో నాకు తెలుసు. నేను సర్వస్వం పోగొట్టుకున్నాను. ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తా. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటా. వైకాపాకు సిద్ధాంతాలు ఉండాలి. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. రూ.1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి రూ.120 కోట్లను మాత్రమే కేటాయించారు.  నా సొంత డబ్బుతో నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు చేశా. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించా. స్వయంగా నేనే రూ.8 కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చాను.

లోకేశ్‌ను ఓడించిన నాకు సహకారం అందించకపోతే ఎలా? నేను ఎవరినీ నిందించడం లేదు. నిధులు మంజూరు చేస్తానని నాకు ధనుంజయ రెడ్డి చాలా సార్లు సందేశాలు పెట్టారు. ఎన్నికలు దగ్గరకు వచ్చినా ఇంకెప్పుడు నిధులు మంజూరు చేస్తారు. రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ల ఇష్టం. నేను స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా ఇచ్చా. ఎవరు గెలవాలని నిర్ణయించేది ప్రజలే. నేను ఏ పార్టీలో చేరినా అదే రోజే నిర్ణయం చెబుతా. గతంలో వైకాపాలోనే ఉంటానని చెప్పి ఇప్పుడు పార్టీని వీడాను. దీనికి సీఎం జగనే సమాధానం చెప్పాలి. చాలా మంది నన్ను ఇతర పార్టీల్లోకి రావాలని ఆహ్వానించారు. వైఎస్ కుటుంబంతోనే ఉన్నా.. ఉంటానని వారికి చెప్పా.

చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తా. వైకాపా ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడను. తప్పులు ఎవరు చేశారు అనేది న్యాయస్థానాలు తేలుస్తాయి. నేను లేకపోయినా మంగళగిరి అభివృద్ధి ఆగదు. నాకు జగన్ టికెట్ ఇవ్వలేదని నేను పార్టీని వీడలేదు. పొమ్మన లేక పొగపెట్టారు. నాకు, చిరంజీవికి, జగన్‌కు మధ్య ఏమి జరిగిందనేది మా అందరికీ తెలుసు’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని