P Chidambaram: ఇంధన ధరల పెంపు.. కేంద్రం శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి

దేశంలో పెరిగిపోతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కేంద్రంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.....

Updated : 26 Oct 2021 05:43 IST

దిల్లీ: దేశంలో పెరిగిపోతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కేంద్రంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 100 కోట్ల టీకా డోసులు ఇచ్చిన తర్వాత సంబురాలు చేసుకున్న విధంగానే.. ఇంధన ధరలు రూ.100 దాటిన సందర్భంగా కేంద్రం ‘శతాబ్ది ఉత్సవాలు’ జరుపుకోవాలంటూ వ్యంగ్యాస్త్రాలు విరిసారు. ‘దేశంలో 100 కోట్ల టీకా డోసులు పూర్తయిన తర్వాత సంబురాలు జరుపుకోవాలని మంత్రులకు మోదీ విన్నవించారు. అదేవిధంగా మరికొన్ని విషయాల్లోనూ ఉత్సవాలు జరుపుకోవాలని ప్రధాని పిలుపునివ్వాలి. దేశంలో కొద్దిరోజుల క్రితమే పెట్రోల్‌ ధర రూ.100 దాటింది. ఇప్పుడు డీజిల్ రూ.100 మార్కును అందుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1000కి చేరింది. ఈ విషయాల్లోనూ కేంద్రం సంబురాలు చేసుకోవాలి’ అంటూ ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు క్రమంగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌ రేటు 110 దాటగా, డీజిల్‌ ధర రూ.100 దాటింది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం పెట్రోల్‌ రేటు రూ.107.59 ఉంటే, డీజిల్‌ ధర రూ.96.32గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.113.46, డీజిల్‌ రేటు రూ.104.38గా కొనసాగుతోంది. గతేడాది మే (2020) నుంచి ఇప్పటివరకు పెట్రోల్‌పై దాదాపు రూ.36 పెరగగా డీజిల్‌పై రూ.26 పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని