Chandrababu: ఇప్పుడు చెప్పండి.. రాయలసీమ ద్రోహులెవరో?: చంద్రబాబు

 ఏపీలో ‘జాకీ’ సంస్థ పెట్టుబడుల ఉపసంహరణపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు రాయలసీమ ద్రోహులు ఎవరో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated : 21 Nov 2022 12:32 IST

అమరావతి: ఏపీలో ‘జాకీ’ సంస్థ పెట్టుబడుల ఉపసంహరణపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు రాయలసీమ ద్రోహులు ఎవరో సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. జాకీ సంస్థ పెట్టుబడుల ఉపసంహరణపై ‘ఈనాడు’లో వచ్చిన కథనాన్ని ఆయన తన ట్వీట్‌కు జతచేశారు.

‘‘సీమకు పరిశ్రమలు తెచ్చిన మేం ద్రోహులమా? లేక కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్లగొట్టిన వైకాపా నేతలా? పాలకులు రాక్షసులైతే ఎలా ఉంటుందో మన రాష్ట్రమే ఉదాహరణ. రాయలసీమలో నాడు తెదేపా ప్రభుత్వం తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయి? పెట్టుబడులను తరిమేసింది ఎవరు?’’ అని చంద్రబాబు నిలదీశారు.

‘జాకీ’ పెట్టుబడుల ఉపసంహరణ.. నేపథ్యమిదీ..

అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో ‘జాకీ’ సంస్థ ఏర్పాటుకు 2017లో అప్పటి తెదేపా ప్రభుత్వం 27 ఎకరాలను కేటాయించింది. రూ.129 కోట్లు పెట్టుబడి పెట్టి ఏటా 32.4 మిలియన్ల దుస్తులను తయారు చేసే కర్మాగారాన్ని, గిడ్డంగిని అక్కడ ఏర్పాటు చేయాలనేది జాకీ కంపెనీ ప్రణాళిక. అందుకు స్థల కేటాయింపులు, సన్నాహాలూ పూర్తయ్యాయి. అయితే రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అనంతపురం సమీపంలోని రాప్తాడు వద్ద పెట్టబోతున్న జాకీ కర్మాగారం ఆ పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధికి ‘అవకాశం’గా, ‘వనరు’గా కనిపించింది.

‘నాకు ఎన్నికల్లో రూ.20 కోట్లు ఖర్చయింది. అందులో సగం మీరు ఇవ్వాల్సిందే’ అని ఆ ప్రజాప్రతినిధి నుంచి కంపెనీ ప్రతినిధులకు బెదిరింపులు వెళ్లినట్లు తెలిసింది. అంతేకాదు.. కంపెనీకి సంబంధించిన సబ్‌ కాంట్రాక్టులన్నీ తాను ఎవరికి చెబితే వారికే ఇవ్వాలని.. ఉద్యోగాలు తాను చెప్పిన ప్రకారమే ఇవ్వాల్సి ఉంటుందని.. అందుకు భిన్నంగా జరిగితే ఊరుకోనని, పనులు జరగనివ్వనని హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్రంలో ముఖ్య నేతలకు సమాచారం ఇస్తే సదరు ప్రజాప్రతినిధిని నియంత్రిస్తారేమోనని కంపెనీ తరఫువారు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

అవి ఫలించకపోవడంతో గత్యంతరం లేని స్థితిలో ‘మీ భూమిని మీరు వెనక్కి తీసుకుని మేం కట్టిన డబ్బులు మాకిచ్చేయండి.. మా దారి మేం చూసుకుంటాం’ అని చెప్పేసి వెళ్లిపోయారు. ఈ మేరకు కంపెనీ సెక్రటరీ సి.మురుగేశ్‌ రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో ఆ సంస్థ ఆంధ్ర నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించడంతో అక్కడ ఒకచోట కాదు.. రెండు చోట్ల పరిశ్రమలు పెట్టేందుకు సిద్ధమైంది. ఇబ్రహీంపట్నం, ములుగుల్లో యూనిట్లను స్థాపిస్తామని.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సహకారం, ప్రోత్సాహంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని