Kejriwal: పంజాబ్‌కు బలమైన ప్రభుత్వం అవసరం :కేజ్రివాల్‌

చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ నేతృత్వంలోని ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని పంజాబ్‌కు బలమైన ప్రభుత్వం అవసరమని ఆమ్‌ఆద్మీపార్టీ (ఏఏపీ)కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌..

Published : 24 Dec 2021 16:30 IST

పంజాబ్‌: చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ నేతృత్వంలోని ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని పంజాబ్‌కు బలమైన ప్రభుత్వం అవసరమని ఆమ్‌ఆద్మీపార్టీ (ఏఏపీ)కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ పేర్కొన్నారు. పంజాబ్‌లో నేడు కేజ్రివాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. చన్నీ ప్రభుత్వంలోని అంతర్గత వివాదాలపై మండిపడ్డారు. పంజాబ్‌లో బలమైన, తక్షణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం అవసరమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలను ఖండించిన కేజ్రివాల్‌.. ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు లుథియానాలో జరిగిన పేలుడు ఘటన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రగా అనిపిస్తోందన్నారు. లుథియానా ఘటనకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి కుట్ర పూరిత ఘటనలను ఎవరూ కూడా ప్రోత్సహించవద్దని పంజాబ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆప్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేరాలకు పాల్పడిన సూత్రధారులను కఠినంగా శిక్షిస్తామని కేజ్రివాల్‌ తెలిపారు. ఆప్‌ అధికారంలోని వస్తే పంజాబ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా శస్ర్తచికిత్సలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని