Punjab Congress: సీఎం అభ్యర్థిని ప్రకటించకుంటే ఓడినట్లే..!

అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న వేళ.. పంజాబ్‌ కాంగ్రెస్‌కు మరిన్ని కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు.

Published : 13 Jan 2022 01:28 IST

ఎన్నికల ముందు పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న వేళ.. పంజాబ్‌ కాంగ్రెస్‌కు మరిన్ని కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా సీఎం అభ్యర్థిపై ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ చేస్తోన్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోనే మరింత వేడిని రాజేస్తున్నాయి. ఓవైపు ఎన్నికల ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ చన్నీ అధిష్ఠానానికి స్పష్టం చేయగా.. పంజాబ్‌ సీఎం ఎవరనేది రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని.. కాంగ్రెస్‌ అధిష్ఠానం కాదని పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూ పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిని ప్రకటించని ప్రతిసారి పార్టీ ఓడిపోయిన విషయాన్ని ఇరువురు నేతలు గుర్తుచేశారు. ఇలా ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న సమయంలో పంజాబ్‌ కాంగ్రెస్‌లో ఇరు అగ్రనేతల ప్రకటనలు కాంగ్రెస్‌ పెద్దలకు మరో సవాలుగా మారినట్లు కనిపిస్తోంది.

అలాగైతే ఓడినట్లే..!

‘2017 ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో ఆ ఎన్నికల్లో విజయం సాధించింది. అంతకుముందు ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించని ప్రతిసారి ఓటమిపాలయ్యింది. అందుకే సీఎం అభ్యర్థిని అధిష్ఠానం ప్రకటించాలి’ అని ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ పేర్కొన్నారు. అయితే, ఆ అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారనే ప్రశ్నకు.. అధిష్ఠానమే ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అన్నారు. అంతేకాకుండా తాను కూడా పాపులర్‌ వ్యక్తినే అన్న ఆయన.. ఆ రేసులో  ఉన్నానని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించమని కాంగ్రెస్‌ ప్రకటించిన నేపథ్యంలో చన్నీ ఈ విధంగా మాట్లాడారు.

నిర్ణయించేది అధిష్ఠానం కాదు..

కొన్నిరోజుల క్రితం వరకూ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సిద్ధూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2017లో సీఎం అభ్యర్థిని ప్రకటించని ఆమ్‌ఆద్మీ కూడా ఓటమిపాలైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందుకే ఎన్నికల ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చిన ఆయన.. తనపేరు ఉండనుందనే సంకేతాలిచ్చారు. అయితే, ముగ్గురు పంజాబ్‌ మంత్రులతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ఇటీవల చర్చలు జరిపిన అనంతరం సిద్ధూ ఆ ప్రస్తావనను మరోసారి తేవడం లేదు. ఇదే సమయంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సిద్ధూ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేది కాంగ్రెస్‌ అధిష్ఠానం కాదని స్పష్టం చేశారు.

ఇలా ఇరువురు అగ్రనేతల మధ్య అంతర్గత పోరును ఎదుర్కొంటోన్న పంజాబ్‌ కాంగ్రెస్‌కు రానున్న అసెంబ్లీ ఎన్నికలు మరింత తలనొప్పిని కలిగించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోన్న సమయంలో పీసీసీ చీఫ్‌, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, పంజాబ్‌ సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ మండిపడ్డారు. రాష్ట్రానికి కఠిన నిర్ణయాలు తీసుకునే నేత అవసరమంటూ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని