Telangana News: సీఎం కేసీఆర్‌తో సమావేశమైన ఛత్రపతి శంభాజీ రాజే

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు శంభాజీ రాజే మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై కేసీఆర్‌తో చర్చించారు.

Updated : 26 Jan 2023 21:49 IST

హైదరాబాద్‌: తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలోనూ అమలు చేస్తే బాగుంటుందని ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, కొల్హాపూర్‌ సంస్థాన సాహూ మహరాజ్‌ మనవడు, మాజీ ఎంపీ శంభాజీ రాజే ఆకాంక్షించారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శంభాజీ రాజే మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై కేసీఆర్‌తో చర్చించారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎంను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ మోడల్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. అద్భుతమైన తెలంగాణ ప్రగతి నమూనా మహారాష్ట్ర సహా దేశమంతటా విస్తరించాలని రాజే అభిప్రాయపడ్డారు. 

ఛత్రపతి శివాజీ నుంచి సాహూ మహారాజ్ వరకు సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా అందించిన పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. శివాజీ, సాహూ మహరాజ్ స్పూర్తి తోనే తెలంగాణలో కుల మత వివక్షకు తావు లేని పాలన కొనసాగుతోందని సీఎం తెలిపారు. రాజర్షి సాహు ఛత్రపతి పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌కు.. శంభాజీ రాజే అందించారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, మధుసూదనచారి, పల్లా రాజేశ్వరరెడ్డి, తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని