KCR: షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన తెరాస విస్తృతస్థాయి  సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. 

Updated : 15 Nov 2022 21:15 IST

హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన తెరాస విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.  ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల్లోనే ఉండాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై పార్టీ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. 

భాజపాలో చేరాలని కవితపై ఒత్తిడి చేశారు..

‘‘తెరాస ఎమ్మెల్యేలు బాగా పనిచేయాలి. ఎమ్మెల్యేలను మార్చాలన్న ఉద్దేశం లేదు. సర్వేలన్నీ తెరాసకే అనుకూలంగా ఉన్నాయి. వందశాతం అధికారం మళ్లీ తెరాసదే. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లబ్ధిదారుల పూర్తి సమాచారం ఎమ్మెల్యేల వద్ద ఉండాలి. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలి. భాజపా నుంచి ఎదురయ్యే దాడిని సమర్థంగా తిప్పికొట్టాలి. మునుగోడు తరహాలో పటిష్ఠ ఎన్నికల వ్యూహం తయారు చేయాలి. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకం కావాలి. ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. తెరాస కార్యకర్తల బలంతో ఎమ్మెల్యేలందరూ ఓటర్లను చేరుకోవాలి. ప్రభుత్వాలను కూలగొట్టేందుకు భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారు. మన దగ్గర కూడా ప్రయత్నించి అడ్డంగా దొరికారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో చట్టం తనపనితాను చేస్తోంది. భాజపా కుట్రలు అన్నింటినీ తిప్పికొడదాం. సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతగా దాడి చేస్తుంటే ఊరుకుందామా? పోరాడదామా? భాజపా చాలా నీచంగా వ్యవహరిస్తోంది. ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీలో చేరాలని భాజపా ఒత్తిడి చేసింది’’ అని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ వివరించారు.

95 సీట్లు అవలీలగా గెలుస్తాం..

‘‘దేశ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణకు మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేయాలని భాజపా చూసింది. భాజపా కుట్రలను తెలంగాణ ప్రపంచం ముందు నిలబెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపాను వదిలే ప్రసక్తే లేదు. అహంకారం, ఉన్మాదంతో రాజకీయాలు చేసే ఏకైక పార్టీ భాజపా. 8ఏళ్లలో అనేక కేసులు పెట్టిన ఈడీ ఒక్కటీ రుజువు చేయలేకపోయింది. భాజపా వద్ద రూ.2లక్షల కోట్లు ఉన్నాయని సింహయాజీ చెబుతున్నారు. ఒక రాజకీయ పార్టీకి ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది. ఎమ్మెల్యేలపై కూడా ఈడీ దాడులకు పూనుకోవచ్చు. భయపడాల్సిన పనిలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో త్వరలో కొన్ని అరెస్టులు ఉండే అవకాశం. మునుగోడులో భాజపా ప్రసాదాలు పంచిందా? గుండాగిరి చేసింది. మునుగోడు ప్రజలు తెరాస వైపు ఉండటాన్ని భాజపా జీర్ణించుకోలేకపోతోంది. దేశంలో కాంగ్రెస్‌ ముగిసిన అధ్యాయమే. ఎవరేం చేసినా కాంగ్రెస్‌ బతకదనే.. రాహుల్‌ గుజరాత్‌లో యాత్ర చేయడం లేదు. వచ్చే ఎన్నికల్లో 95 సీట్లు అవలీలగా గెలుస్తాం. నియోజకవర్గంలో 100 మంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని ఎమ్మెల్యేలు నియమించుకోవాలి. పార్టీ మారుతారా అని ఫోన్‌ చేస్తే.. చెప్పుతో కొడతా అని గట్టిగా చెప్పాలి’’ అని పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని