Himachal Polls 2022: రాబోయే 25 ఏళ్లు భాజపాదే అధికారం: జైరాం ఠాకూర్‌

హిమాచల్‌ ప్రదేశ్‌లో వచ్చే 25 ఏళ్లపాటు భాజపానే అధికారం సొంతం చేసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ ధీమా వ్యక్తం చేశారు. వరుసగా రెండోసారి ఏ పార్టీకీ అధికారం ఇవ్వని హిమాచల్‌ ప్రజలు ఈసారి చరిత్రను తిరగరాస్తారన్నారు

Published : 08 Nov 2022 01:42 IST

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో వచ్చే 25 ఏళ్లపాటు భాజపానే అధికారంలో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ ధీమా వ్యక్తం చేశారు. వరుసగా రెండోసారి ఏ పార్టీకీ అధికారం ఇవ్వని హిమాచల్‌ ప్రజలు ఈసారి చరిత్రను తిరగరాస్తారన్నారు. 1982 నుంచి హిమాచల్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు ఏపార్టీ కూడా వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టని విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఎప్పటిలాగే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ భావించొచ్చనీ, అయితే,  ఈసారి హిమాచల్‌ ప్రజల తీర్పు భిన్నంగా ఉండబోతోందన్నారు. సంప్రదాయానికి భిన్నంగా మళ్లీ భాజపాకే హిమాచల్‌ ప్రజలు పట్టంకడతారని జైరాం ఠాకూర్‌ వ్యాఖ్యానించారు.

బంజార్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జైరాం ఠాకూర్‌ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ నాయకులు ఈసారి తమవంతు అనుకుంటున్నారు. కానీ, ఉత్తరాఖండ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ వారు అదే మాట చెప్పారు. అక్కడ కాంగ్రెస్‌ పరిస్థితి ఏమైంది. కొన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయారు. అధికారంలోకి వస్తే మేం అది చేస్తాం, ఇది చేస్తామని కాంగ్రెస్‌ ప్రగల్భాలు పలుకుతోంది. పని చేతకానివాళ్లే మాటలతో సరిపెడతారు’’ అని సీఎం వ్యాఖ్యానించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ మునిగిపోతున్న నావ లాంటిదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని