Congress: భాజపానే దేశానికి అతిపెద్ద ఎన్‌పీఏ: కాంగ్రెస్‌

వ్యాపారస్థులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తూ.. కేంద్రం ప్రజల సొమ్మును వృథా చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశానికి అతి పెద్ద ఎన్‌పీఏ భాజపానే అని విమర్శించింది. 

Published : 23 Nov 2022 01:06 IST

దిల్లీ: ఎన్డీయే హయాంలో దేశంలో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) పెరిగాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. వ్యాపారస్థుల రుణాలను మాఫీ చేస్తూ ప్రజల సొమ్మును కేంద్రం వృథా చేస్తోందని విమర్శించింది. తక్కువ ధరలకే ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు అపరిమిత అధికారాలు ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది. బ్యాంకులకు రుణాలు ఎగవేసి పరారీలో ఉన్న 38 మందిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతుందని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. 

‘‘ భాజపా హయాంలో ఎన్‌పీఏలు 365 శాతం పెరిగాయి. భారత్‌కు ఉన్న అతి పెద్ద ఎన్‌పీఏ భాజపానే. గత ఐదేళ్లలో కేంద్రం ₹ 10 వేల కోట్ల విలువైన ఎన్‌పీఏలను తగ్గించుకుని, కేవలం వెయ్యి కోట్లు మాత్రమే వసూలు చేసింది. పెద్ద వ్యాపారస్థులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ.. ప్రజల సొమ్మును కేంద్రం వృథా చేస్తోంది. దీని వల్ల చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను తీవ్రంగా నష్టపోతున్నాయి’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్ చేశారు. 

‘‘సామాన్యుడు తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించకపోతే వారిని వేధింపులకు గురిచేసే బ్యాంకులు, వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వారి వివరాలను ఎందుకు వెల్లడించడంలేదు’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా ష్రినాతే ప్రశ్నించారు. 2008-14 మధ్య కాలంలో ₹ ఐదు లక్షల కోట్లుగా ఉన్న ఎన్‌పీఏలు, 2014-20 మధ్య ₹ 18 లక్షల కోట్లకు పెరిగాయని అన్నారు. ప్రతి ఎన్నికల్లో పనితీరు ఆధారంగా కాకుండా, ప్రధాని మోదీని చూసి ఓటేయాలని కోరుతూ.. భాజపా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని