Karnataka Elections: ఐడియాలిస్తాం.. గెలిపిస్తాం.. కర్ణాటకలో వ్యూహకర్తలకు డిమాండ్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజకీయ వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో 5000 మంది వ్యూహకర్తలు పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 20 Apr 2023 18:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటక ఎన్నికల (karnataka Elections) వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. నామినేషన్ల (Election Nomination) గడువు కూడా నేటితో పూర్తి కానుండటంతో అభ్యర్థులు బరిలోకి దిగే స్థానాల్లోనూ ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. జాతీయ స్థాయి నాయకులను ప్రచారానికి రప్పించి.. ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే, ఈ సారి ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు పార్టీల దృష్టి ఎన్నికల వ్యూహకర్తలపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5000 మందికిపైగా వ్యూహకర్తలు తమ అభ్యర్థుల విజయం కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యర్థి వ్యూహాలను అంచనా వేస్తూ.. అవతలి వారిని ఇరుకున పెట్టేలా ఎత్తుగడలు వేస్తూ తన అభ్యర్థికి సలహాలు సూచనలు అందించడమే రాజకీయ వ్యూహకర్తల ప్రధాన బాధ్యత. అధికారంలోకి వస్తే తమ పార్టీ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వ్యూహకర్తలే ప్రధాన భూమిక పోషిస్తుంటారు.
తమ వ్యూహాలకు పదును పెడుతూ.. అభ్యర్థుల విజయానికి కృషి చేసేవారే రాజకీయ వ్యూహకర్తలు అంటారు భాజపా సీనియర్‌ నేత సీఎస్‌ అశ్వత్‌ నారాయణ్‌.తాజా ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వీళ్లకు స్పష్టమైన అవగాహన ఉండకపోవచ్చు. సభలు, సమావేశాల్లో ఎలాంటి అంశాలను ప్రస్తావించాలి? ఏ మార్గంలో వెళితే ప్రజల మన్ననలు అందుకోచ్చు? అనే విషయాలపై వీళ్లకు క్లారిటీ ఉండదు. అలాంటి సమయాల్లో వ్యూహకర్తల సలహాలు తీసుకుంటే.. ప్రజల్లోకి దూసుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని సీనియర్‌ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేస్తూ.. వ్యూహాలు రచించగల సమర్థులను వ్యూహకర్తలుగా నియమించుకుంటున్నారు. 

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 50 మంది కొత్త అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. అంతేకాకుండా వారికి మద్దతుగా కొంత మంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసింది. వీరంతా అభ్యర్థులకు రాజకీయ వ్యూహకర్తలుగా  పని చేయాలి. వీరిలో డాక్టర్లు, ఇంజినీర్లు, టీచర్లు కూడా ఉన్నారు. వీరందరికీ పార్టీ పరంగా ఎలాంటి హోదా ఉండదు. ఎన్నికలు ముగిసేంత వరకు వాళ్లు కేటాయించిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సి ఉంటుంది. ‘రాజకీయ రంగంలో పని చేయాలనుకునే వారికి హోదా అవసరం లేదు. ప్రజల్లో మమేకం కావాలనుకుంటే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలా అవసరం. చెప్పదలచుకున్న అంశాన్ని ప్రజలకు సూటిగా చెప్పగలిగే నైపుణ్యం ఉండాలి’ అని అంటారు భాజాపా కర్ణాటక మీడియా అధికార ప్రతినిధి స్మృతి ఇరానీ. కానీ, రాజకీయ వ్యూహకర్తల విషయానికి వచ్చే సరికి నమ్మకమే ప్రధానం. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ నాయకుడైన  కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు 15 ఏళ్ల పాటు కేజీ స్వామి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. అయితే, నాయకుడికి, వ్యూహకర్తపై అంత తొందరగా నమ్మకం కుదరదు అంటున్నారు కేజీ స్వామి.. తొలుత చిన్న చిన్న పనులు అప్పగిస్తారని, ఒకసారి నమ్మకం వచ్చిన తర్వాతనే కీలక బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు.

కర్ణాటక ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థుల తరఫున పని చేస్తామంటూ 40-50 మంది  రాజకీయ వ్యూహకర్తలు తమని సంప్రదించినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు ప్రియా కృష్ణ తెలిపారు. వీరంతా ముంబయి, పశ్చిమ్‌బెంగాల్‌, ఒడిశా నుంచి వచ్చినట్లు ఆమె చెప్పారు. అయితే మనం ఏం చేయాలనుకుంటున్నామో వాటినే పథకం ప్రకారం వ్యూహకర్తలు అమలు పరుస్తారనీ,  ప్రస్తుత రోజుల్లో ఇదో వ్యాపారంగా మారిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని