Congress: అధ్యక్ష ఎన్నికకు కాంగ్రెస్‌ సిద్ధం.. పోటీపై మౌనంగానే రాహుల్‌..?

వరుస పరాజయాలతో సతమతమవుతోన్న కాంగ్రెస్‌ పార్టీని.. నాయకత్వ సంక్షోభం కూడా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు (Congress President) సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Updated : 10 Aug 2022 19:52 IST

పార్టీ వర్గాలు వెల్లడి

దిల్లీ: వరుస పరాజయాలతో సతమతమవుతోన్న కాంగ్రెస్‌ పార్టీని.. నాయకత్వ సంక్షోభం కూడా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు (Congress President) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ఆగస్టు 21వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ పోటీలో అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఉంటారా లేదా అనే విషయం మాత్రం తెలియరాలేదు. దీనిపై రాహుల్‌ గాంధీ కూడా మౌనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష ఎన్నిక తర్వాత, సీడబ్ల్యూసీతోపాటు పార్టీలోని ఇతర విభాగాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి బాధ్యతలు సోనియా గాంధీ (Sonia Gandhi) చేతుల్లోకి వెళ్లిపోయాయి. అయితే, కాంగ్రెస్‌ పార్టీకి గాంధీ కుటుంబం కాకుండా ఇతరులు సారథ్యం వహించాలనే డిమాండ్‌ ఎంతోకాలంగా వినిపిస్తోంది. దీనిపై పార్టీలో అనేకసార్లు చర్చ జరిగినప్పటికీ  పార్టీలో ఏకాభిప్రాయం మాత్రం రాలేదు. కానీ, గాంధీ కుటుంబం చేతుల్లోనే పార్టీపగ్గాలు ఉంటే ఎటువంటి చీలికలు రావని మెజారిటీ కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

ఇదిలాఉంటే, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ 2017లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 లోక్‌సభ సీట్లకు గాను కాంగ్రెస్‌ పార్టీ కేవలం 52 స్థానాతోనే సరిపెట్టుకుంది. ఇలా కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం కావడంతో అందుకు బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడంతో పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది మార్చి నెలలో ఏర్పాటు చేసిన పార్టీ సమీక్షా సమావేశంలో తనతోపాటు రాహుల్‌, ప్రియాంకా గాంధీలు కూడా పార్టీలో తమ పదవులను వదులుకుంటామని ప్రకటించారు. ఆమె ప్రతిపాదనను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) తిరస్కరించడంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని