భువనగిరి కాంగ్రెస్‌లో ముసలం.. ఎంపీ కోమటిరెడ్డిపై పార్టీ జిల్లా అధ్యక్షుడి నిరసన గళం

ఎన్నికల ముంగిట యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ (Congress)లో ముసలం నెలకొంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకోవడం, పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోకపోవడంతో చుక్కాని లేని నావల పార్టీ తయారైంది.

Updated : 24 Jul 2023 18:12 IST

భువనగిరి: ఎన్నికల ముంగిట యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ (Congress)లో వర్గపోరు నెలకొంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకోవడం, పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోకపోవడంతో చుక్కాని లేని పడవలా పార్టీ తయారైంది. భువనగిరి నియోజకవర్గంలో పార్టీ కీలక నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి (KomatiReddy Venkat Reddy) చేస్తున్నది తప్పని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్ణణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేసి.. బహిరంగ విమర్శలు గుప్పించారు. 

‘‘పార్టీలో జరుగుతున్న పరిణామాలు చర్చించటానికే ఈ సమావేశం ఏర్పాటు చేశా. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఇబ్బందులు ఉన్నాయి. అందుకే కార్యకర్తల సమావేశం నిర్వహించా. తన ఇంట్లోనే ఐదారు సీట్లు తీసుకున్నప్పుడు కోమటిరెడ్డికి బీసీలు గుర్తు రాలేదా? ఇప్పుడు బీసీలకే భువనగిరి టికెట్‌ ఇవ్వాలని సమాంతరంగా సమావేశాలు పెడుతూ పార్టీ క్యాడర్‌ను డిస్టర్బ్‌ చేస్తున్నారు’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. 

అయితే, కాంగ్రెస్‌ నుంచి ఇప్పటికిప్పుడు తాను పార్టీ మారనని.. ఎంపీ కోమటిరెడ్డి అంశాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పెద్దల స్పందనను బట్టి.. తన నిర్ణయం ఆలోచిస్తానని చెప్పారు. అయితే, వీటన్నింటి పరిణామాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని