Purandeswari: జనసేన ఆ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు.. మేం పొత్తులోనే ఉన్నాం: పురందేశ్వరి

జనసేనతో తమ పొత్తు ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. తమతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు జనసేన ఎక్కడా చెప్పలేదన్నారు.

Updated : 16 Dec 2023 20:25 IST

ఏలూరు: జనసేనతో తమ పొత్తు ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) స్పష్టం చేశారు. తమతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు జనసేన ఎక్కడా చెప్పలేదన్నారు. పొత్తులు భాజపా కేంద్ర నాయకత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె పర్యటించారు. అనంతరం దండమూడిలో జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

‘‘రాజధాని అమరావతికి కేంద్రం నిధులు ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగుతోంది. త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తాను. పోలవరం నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రమే భరిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా పార్టీని సన్నద్ధం చేస్తున్నాం. దొంగ ఓట్లపై మేము కూడా పోరాడుతున్నాం. నకిలీ ఐడీలు సృష్టించి ఓట్లు నమోదు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లాం. 

ఏలూరు జిల్లాకే పీఎం ఆవాస యోజన కింద లక్ష ఇళ్లు కేటాయించాం. వైకాపా ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మించిందో శ్వేతపత్రం ఇవ్వాలి. రాష్ట్రంలో విధ్వంసక పాలన చూస్తున్నాం. ఆడుదాం ఆంధ్రా కాదు.. వైకాపా నేతలు ఆంధ్రతో ఆడుకుంటున్నారు. ప్రతి పైసా తమ జేబుల్లోకి వెళ్లాలనేది వైకాపా ఆలోచన. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాని పరిస్థితి.. అడిగితే కేసులు, వేధింపులు. తుపాను కారణంగా పొగాకు పంటలు బాగా దెబ్బతిన్నాయి. స్వయం ఉపాధి రుణాలను సైతం దారి మళ్లించారు. రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్‌కు చట్టబద్ధత లేదు. రాష్ట్రానికి ఏ విధంగానూ న్యాయం చేయని వైకాపా ఏపీకి అవసరమా?’’ అని పురందేశ్వరి ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని