Delhi: అరవింద్‌ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం..!

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు చేదు అనుభవం ఎదురైంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కలిసేందుకు ముందస్తు అనుమతిని ఎల్జీ కార్యాలయం తిరస్కరించింది.

Published : 11 Jan 2023 01:32 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా మధ్య అధికార పోరు తారస్థాయికి చేరింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కలిసేందుకు సీఎం ముందస్తు అనుమతి కోరగా.. ఎల్‌జీ కార్యాలయం నిరాకరించినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ (APP) వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎల్‌జీ కార్యాలయం స్పందించలేదు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతోపాటు, పరిపాలన సంబంధిత అంశాలపై చర్చించేందుకు తన కార్యాలయానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా (VK saksena) సోమవారం లేఖ రాశారు. ఆహ్వానం అందుకున్న కేజ్రీవాల్‌.. వీలు చూసుకొని కలుస్తానని, ఎప్పుడు కలుస్తానన్న విషయాన్ని ఎల్‌జీ కార్యాలయానికి సమాచారమిస్తానని తిరిగి లేఖ రాశారు. అయితే, దీనిపై సానుకూలంగా స్పందించని ఎల్‌జీ కార్యాలయం.. ముందస్తు అనుమతి ఇవ్వడం కుదరదని, వివిధ కార్యక్రమాలతో శుక్రవారం వరకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చాలా బిజీగా ఉన్నారని చెప్పినట్లు తెలుస్తోంది.

గత కొన్ని నెలలుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌,  కేజ్రీవాల్‌ ప్రభుత్వం మధ్య పొసగడం లేదు. ఇటీవల జరిగిన దిల్లీ మున్సిపల్‌ ఎన్నికలతో వీరిద్దరి మధ్య అధికార పోరు తీవ్రమైంది. మేయర్‌ను ఎన్నుకునే సమయంలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా భాజపాకి చెందిన వ్యక్తిని నియమించడంతోపాటు, హజ్‌కమిటీ సభ్యుల ఎంపికలోనూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వ్యవహరించిన తీరుపై కేజ్రీవాల్‌ అసహనంతో ఉన్నారు. స్థానిక ప్రభుత్వాన్ని పక్కకు నెట్టి కేంద్రానికి అనుకూలంగా వ్యవరిస్తున్నారని ఆప్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్జీ అనుమతి నిరాకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని