Eatala Jamuna: కలెక్టర్‌ ఆరోపణలన్నీ అసత్యం.. మాకున్నది 8.36 ఎకరాలే: ఈటల జమున

జమున హేచరీస్‌కు సంబంధించిన భూములను ఈటల రాజేందర్‌ బలవంతంగా ఆక్రమించుకున్నారంటూ కలెక్టర్‌ హరీశ్‌ అసత్య ఆరోపణలు

Published : 07 Dec 2021 02:18 IST

హైదరాబాద్‌: జమున హేచరీస్‌కు సంబంధించిన భూములను ఈటల రాజేందర్‌ బలవంతంగా ఆక్రమించుకున్నారంటూ కలెక్టర్‌ హరీశ్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈటల సతీమణి జమున ఆరోపించారు. సోమవారం షామీర్‌పేటలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మెదక్ జిల్లాలోని అచ్చంపేట, హకీంపేటలలో ఈటెల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నట్లు జిల్లా కలెక్టర్ హరీశ్‌ పేర్కొన్న నేపథ్యంలో ఆమె స్పందించారు.

‘‘జమున హేచరీస్‌ భూములపై కలెక్టర్‌ హరీశ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టారు. ఈ విషయంలో విలేకరుల సమావేశం పెట్టడానికి ఆయనకు ఏం అధికారం ఉంది? ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాం. వాళ్లు వచ్చి మళ్లీ సర్వే చేశారు. వాటికి సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాలి. ‘మీ భూమి ఇదే. ఇంతే ఉంది’ అని కనీసం మాకు ఒక కాపీ ఇవ్వాలి. మాకు ఎలాంటి వివరాలు చెప్పలేదు. ఈ రోజు నేరుగా విలేకరుల సమావేశం పెట్టి, భూములు ఆక్రమించుకున్నారంటూ కలెక్టర్‌ ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌ ఏమైనా రాజకీయ నాయకుడా? తెరాస ప్రభుత్వానికి క్లర్క్‌గా పనిచేస్తున్నారా? ఈ విషయమై ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఎలాంటి సమస్యలు లేని భూములే ధరణిలోకి ఎక్కుతాయని గతంలో సీఎం కేసీఆర్‌ చెప్పారు. 2019లో అలాంటి భూములనే మేము కొనుగోలు చేశాం. మొత్తంగా మాకున్నదే 8.36 ఎకరాలు. కలెక్టర్‌ చెప్పిన 70 ఎకరాలతో మాకు సంబంధం లేదు. ఆక్రమణకు సంబంధించిన ఆరోపణలు ఉంటే ఈ రెండేళ్లు ఏం చేశారు? ఇది కచ్చితంగా వ్యక్తిగత కక్ష సాధింపు చర్యల కిందకే వస్తుంది. రాజకీయంగా ప్రత్యర్థి అయితే, అలాగే ఎదుర్కొవాలి. ఈటల రాజేందర్‌ 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ అధికారికైనా ఫోన్లు చేశారా? అధికారులకు ఫోన్లు చేసి భూములు ఆక్రమించుకున్నారా? గతంలో లేనిది ఇప్పుడే ఆక్రమించుకున్నారని ఎందుకు చెబుతున్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే ఈ ప్రభుత్వం ఒక మహిళా వ్యాపారవేత్త మీద దాడి చేయటం సరైన పద్ధతి కాదు’’ అని జమున మండిపడ్డారు.

ఇంతకీ కలెక్టర్‌ ఏమన్నారంటే...!

ఈటల రాజేందర్ భూఅక్రమాల ఆరోపణలపై మెదక్‌ జిల్లా కలెక్టర్ నివేదిక రూపొందించారు. గత మేలోనే భూములను సర్వే చేసి నివేదిక సిద్ధం చేయగా.. అధికారులు సహజ న్యాయ సూత్రలకు విరుద్ధంగా వ్యవహరించారని ఈటల వర్గం హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ఈటల రాజేందర్ భార్య జమున, కొడుకు నితిన్ రెడ్డిలతో పాటు అచ్చంపేట, హకీంపేట గ్రామాల చెందిన 156మందికి  నోటిసులు జారీ చేశారు. గత నెల 16వ తేదీ నుంచి సుమారు 15రోజుల పాటు పునః సర్వే నిర్వహించారు. అచ్చంపేట గ్రామ పరధిలోని 77, 78, 79, 80, 81, 82, 130, హకీంపేట పరిధిలోని 97, 111 సర్వే నెంబర్లలో సర్వే నిర్వహించారు. జమున హేచరీస్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నట్లు ఈ రోజు ఉదయం కలెక్టర్ హరీశ్‌ స్పష్టం చేశారు. ఈ రెండు గ్రామాల పరిధిలో 70.33ఎకరాల భూమి అక్రమించుకున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు జమున హేచరీస్ వివిధ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డట్టు ఆయన తన నివేదకలో పేర్కొన్నారు. అంతేకాదు, జమునా హేచరీస్ వల్ల వాతవరణ కాలుష్యం ఏర్పడిందని తెలిపారు. కోళ్ల వ్యర్థాల వల్ల స్థానికంగా ఉన్న ఎల్కం చెరువు నీరు, భూగర్భ జలాలు, గాలి కలుషితమైందని.. దుర్వాసన సైతం వస్తోందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కలెక్టర్ కు నివేదిక ఇచ్చారు. అచ్చంపేట గ్రామంలోని 81, 130  సర్వే నెంబర్లలో ఉన్న భూములు నిషేధిత జాబితాలో ఉన్నా.. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. నిబంధలకు విరుద్ధంగా జరిగిన ఈ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామన్నారు.

Read latest Political News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని