Andhra News: నెల్లూరు వైకాపాలో వర్గపోరు.. అనిల్‌ X కాకాణి

మంత్రివర్గ విస్తరణ తర్వాత నెల్లూరు జిల్లా వైకాపాలో వర్గపోరు మొదలైందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ వ్యవహారశైలి రాజకీయ వర్గాల్లో చర్చకు

Published : 15 Apr 2022 01:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మంత్రివర్గ విస్తరణ తర్వాత నెల్లూరు జిల్లా వైకాపాలో వర్గపోరు మొదలైందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ వ్యవహారశైలి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రెండ్రోజుల క్రితం మంత్రి కాకాణికి సహకారం అందిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే అనిల్‌ తనదైన శైలిలో స్పందించారు. తన మనసులో మాటను చెప్పకనే చెప్పారు. ‘‘మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కాకాణి నన్ను ఆహ్వానించలేదు. పిలవకుండా తాను ఎందుకు వెళ్లాలన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి అన్న చేసిన సహకారం, ఆయన చూపిన ప్రేమ, వాత్సల్యం.. నాకేదైతే సహకారం అందించారో కచ్చితంగా అదే ప్రేమ, అదే వాత్సల్యం, సహకారం రెండింతలు అందిస్తా. ఎవరేమన్నా కాకాణి జిల్లా మంత్రి అని.. నెల్లూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అవసరమని భావిస్తే తప్పకుండా ఆహ్వానిస్తామన్నారు’’ అంటూ సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో గతంలో గ్యాప్‌ ఉన్న నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో ఇవాళ మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని సజ్జపురంలో వీరిద్దరూ కీలక సమావేశం నిర్వహించారు. మంత్రివర్గంలో స్థానం దక్కలేదని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి 3 రోజుల క్రితం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో అనిల్‌ కుమార్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి భేటీ కావడం రాజకీయాంగా చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనిల్‌, కోటంరెడ్డి ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? మంత్రి కాకాణి జిల్లాకు వచ్చినప్పుడు వీరిద్దరూ కలుస్తారా? లేదా? అని వైకాపా శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. పార్టీలో విభేదాలు అవసరమా? అని కొందరు కార్యకర్తలు ప్రస్తావించగా... మంత్రిగా ఉన్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమానికి కూడా కాకాణి తనను ఆహ్వానించలేదని అనిల్‌ కుమార్‌ కార్యకర్తల వద్ద తన అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా... మంత్రిగా ప్రమాణం చేసిన కాకాణి గోవర్థన్‌రెడ్డి ఈనెల 17న తొలిసారిగా.. నెల్లూరు జిల్లాకు విచ్చేస్తున్నారు. అయితే, అదేరోజు కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించేందుకు అనిల్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. కాకాణికి స్వాగతం పలికే రోజే.. అనిల్‌ కార్యకర్తల సమావేశం పెట్టడం వెనుక వ్యూహం ఏంటనేదానిపై చర్చ జరుగుతోంది. మంత్రి వర్గంలో స్థానం దక్కలేదని అసంతృప్తిగా ఉన్న నేతలు ఒక్కొక్కరినీ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అసంతృప్తులు దారికొస్తున్న తరుణంలో... నేతల మధ్య వర్గ పోరుతో కొత్త చిచ్చు మొదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని