TamilNadu: భాజపాలోకి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు.. సార్వత్రిక ఎన్నికల ముంగిట కీలక రాజకీయ పరిణామం

తమిళనాడులో అధికార డీఎంకే సహా ప్రతిపక్ష అన్నాడీకేం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. 

Updated : 07 Feb 2024 15:58 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముంగిట తమిళనాడు (TamilNadu)లో పార్టీ బలోపేతంపై భాజపా (BJP) దృష్టి సారించింది. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బుధవారం పార్టీలో చేరారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కేంద్ర మంత్రులు రాజీవ్‌ చంద్రశేఖర్‌, ఎల్‌. మురుగన్‌లు పార్టీలో చేరినవారికి కండువా కప్పి ఆహ్వానించారు. వీరిలో ఎక్కువమంది అన్నాడీఎంకే (AIADMK)కు చెందినవారు కావడం..ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

నాయకుల చేరికతో తమిళనాడులో భాజపా మరింత బలోపేతమవుతుందని, ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీలే కారణమని, ఈసారి తమిళనాడు ప్రజలు తప్పకుండా భాజపాకే మద్దతు పలుకుతారని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా అన్నామలై బాధ్యతలు చేపట్టినప్పటినుంచి అధికార, విపక్షాలపై పదునైన విమర్శలు చేస్తూ.. భాజపా సిద్ధాంతాలను బలంగా వినిపిస్తున్నారు. ‘ఎన్‌ మన్‌- ఎన్‌ మక్కల్‌’ (నా భూమి- నా ప్రజలు) పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్రకు విశేష ప్రజాదరణ లభించింది. ఈనెల 25న కోయంబత్తూరులో పాదయాత్ర ముగింపు వేడుకలో ప్రధాని మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

గతంలో భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే భాగస్వామిగా ఉండేది. అన్నామలై భాజపా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సందర్భాల్లో అన్నాడీఎంకే నేతల అవినీతిపై ఆరోపణలు చేశారు. దాంతోపాటు దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబరులో ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. తాజాగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలు భాజపాలో చేరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని