ఆర్థికసాయం నిధులు రాష్ట్ర ప్రభుత్వానివే:అంబటి

కరోనా వ్యాప్తితో ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. సామాన్యుడు బయటకు రాలేని పరిస్థితుల్లో పేదలకు నిత్యావసరాలతో పాటు

Published : 06 Apr 2020 01:42 IST

తాడేపల్లి: కరోనా వ్యాప్తితో ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. సామాన్యుడు బయటకు రాలేని పరిస్థితుల్లో పేదలకు నిత్యావసరాలతో పాటు రూ.వెయ్యి ఆర్థికసాయం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. దీనిపైనా విమర్శలు సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయానికి సీఎం జగన్‌ స్టాంప్‌ వేసుకుని పంచుతున్నారంటూ భాజపా నేతలు చేస్తోన్న ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ఆ నిధులు ప్రధాని మోదీ, జగన్‌వి కాదని.. ప్రజలవేనని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ప్రజలకు పంపిణీ చేస్తున్న రూ.వెయ్యి ఆర్థిక సాయం నిధులు రాష్ట్ర ప్రభుత్వానివే అని ఆయన స్పష్టం చేశారు. దీనిపై జీవో సైతం విడుదలైందని చెప్పారు. 

ప్రజల్ని ఆదుకోవాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రజల్లో ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతో బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. వాలంటీర్లు అవినీతికి పాల్పడినట్లు ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారని.. అదే నిజమైతే సాక్ష్యాధారాలతో రుజువు చేస్తే కచ్చితంగా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నగదు పంపిణీ సమయంలో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని చెబుతున్నారంటూ వాలంటీర్లపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధికారం కోసం తెదేపా నేతలు అర్రులు చాస్తున్నారని అంబటి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని