ఏ ఒక్కరూ పస్తులతో నిద్రపోవద్దనే..

దేశంలో ఏ ఒక్కరూ పస్తులతో పడుకోకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను నవంబర్‌ వరకు పొడగించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు....

Published : 01 Jul 2020 01:22 IST

గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పొడగించిన మోదీ: జావడేకర్‌

దిల్లీ: దేశంలో ఏ ఒక్కరూ పస్తులతో పడుకోకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను నవంబర్‌ వరకు పొడగించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

అన్‌లాక్‌ తొలి దశ ముగిసి రెండో దశలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. పండుగల సీజన్‌ ఆరంభమవ్వడం, కరోనా వైరస్‌ నుంచి విముక్తి లభించకపోవడంతో ఉచిత రేషన్‌ పథకాన్ని దీపావళి లేదా నవంబర్‌ వరకు పొడగిస్తున్నామని తెలిపారు. 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం, గోధుమలు, కిలో కందిపప్పు చొప్పున ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ.90వేల కోట్లు ఖర్చుచేయనున్నామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

‘80 కోట్ల మంది ప్రజలు. అంటే 16 కోట్ల కుటుంబాలు. 25 కిలోల బియ్యం, 5 కిలోల పప్పు రాబోయే ఐదు నెలలు ఉచితంగా పొందుతారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇలాంటి ఆహార భద్రతా పథకం లేదు. ఇది అందరి ఆహార అవసరాలను తీరుస్తుంది’ అని జావడేకర్‌ అన్నారు. ఈ పథకంతో దేశంలో ఎవ్వరూ ఆకలితో పస్తులుండరని ఆయన పేర్కొన్నారు. పీఎంజీకేఏవై పథకాన్ని పొడగించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని