రాష్ట్ర అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయ్‌

రాష్ట్ర అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

Published : 03 Feb 2023 05:34 IST

అత్యధిక ధరలు తెలంగాణలోనే
ఈటల రాజేందర్‌ ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. జీడీపీలో కేంద్ర అప్పుల నిష్పత్తి 2014-15 నుంచి, గత ఏడాదికి సుమారు 1.4 శాతం తగ్గగా, అదే కాల వ్యవధిలో తెలంగాణ అప్పులు జీఎస్‌డీపీలో 15 శాతం నుంచి 28.8 శాతానికి పెరిగాయన్నారు. కేంద్ర బడ్జెట్‌ ప్రజలను మభ్యపెట్టకుండా వాస్తవాలతో ఉందన్నారు.  గురువారం రాష్ట్ర భాజపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి ఈటల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో ధరలు అత్యధికంగా పెరిగాయని, దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఇక్కడ ఉండటమే దానికి నిదర్శనమన్నారు. తెరాస ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రతి వ్యక్తిపై అప్పుల భారాన్ని రూ.1.2 లక్షలకు పెంచిందని ఆరోపించారు. రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థితిలోనూ లేదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు ఎక్కడ ఇస్తున్నారో నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని పునరుద్ఘాటించారు. సీఎం కేసీఆర్‌ రూ.30 లక్షల రైతుబంధు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. పెరిగిన ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని సీఎంను ప్రశ్నించారు. 

అసహనంతోనే ఈటల వ్యాఖ్యలు: భానుప్రసాద్‌ 

భాజపా చేరికల కమిటీ అధ్యక్షుడిగా విఫలమైనందునే ఈటల రాజేందర్‌ అసహనంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని భారాస ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ ఆరోపించారు. రాష్ట్రం అప్పులు ఉత్పాదక రంగం కోసమేనన్నారు. కేంద్రం అప్పులు తెచ్చి ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు