ఆ జిల్లాల ఆదాయం అక్కడే ఖర్చు చేస్తారా?

‘‘తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న ఆదాయం వెనక్కి రావడం లేదని, కేంద్రం సహకరించడం లేదని భాజపాను కొందరు విమర్శిస్తున్నారు.

Updated : 05 Feb 2023 06:08 IST

భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు

ఈనాడు-హైదరాబాద్‌, గాంధీభవన్‌-న్యూస్‌టుడే: ‘‘తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న ఆదాయం వెనక్కి రావడం లేదని, కేంద్రం సహకరించడం లేదని భాజపాను కొందరు విమర్శిస్తున్నారు. దేశ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. ఉదాహరణకు తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి వంటి జిల్లాల్లో ఎక్కువ ఆదాయం వస్తోంది. ఈ సొమ్మును ఇక్కడే ఖర్చు చేయాలని ఈ జిల్లాలవారు అంటే ఏం చేస్తారు?’’ అని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. శనివారం శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, అసెంబ్లీ మీడియా పాయింట్‌లోనూ ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణకు కేంద్రం ఒక్క వైద్య కళాశాలనూ ఇవ్వలేదని కొందరు విమర్శిస్తున్నారు. కేంద్రం నూతన విధానం తెచ్చే సమయానికి తెలంగాణలో 10 కాలేజీలున్నాయి. ఆ మాత్రం కూడా లేని రాష్ట్రాల్లో తొలుత ఏర్పాటు చేసిన తర్వాత.. రాష్ట్రానికి కూడా ఇవ్వాలనేది కేంద్రం విధానం’’ అని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధి వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘2014 నుంచి ఇప్పటివరకూ సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో రూ.890 కోట్లు, సిద్దిపేటలో రూ.790 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం సమాధానమిచ్చింది. 2020లో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి దుబ్బాకకు ఏమీ ఇవ్వలేదు’’ అని అన్నారు. ‘‘దుబ్బాక ఉప ఎన్నికలో నేను ఎలాంటి కరపత్రం పంచలేదు. కేటీఆర్‌ చూపించింది 2018 సాధారణ ఎన్నికల నాటిది. దానికి కట్టుబడి ఉన్నా. మేము అధికారంలోకి వస్తే అందులో ఉన్నవన్నీ నెరవేరుస్తాం’’ అని స్పష్టంచేశారు.


ఎసైన్డ్‌ భూములను లాక్కుంటున్నారు: ఈటల

మంత్రి కేటీఆర్‌ తన వాగ్ధాటితో తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. శనివారం శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, అసెంబ్లీ మీడియా పాయింట్‌లోనూ ఆయన మాట్లాడారు. ధరణి బాగుందని కితాబు ఇచ్చుకోవడం కాదని, ఇప్పటికీ 20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. ధరణి కారణంగా దశాబ్దాల క్రితం పేదలకు ఇచ్చిన ఎసైన్డ్‌ భూములను మళ్లీ లాక్కుంటున్నారని ఆరోపించారు. శాసనసభలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బస్తీల్లో విద్యుత్‌ కోతలు విధిస్తున్నారన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని