వారు ప్రజలను దోచుకున్నారు.. మేం జీరో నుంచి హీరో అయ్యాం

త్రిపుర ప్రజలను సీపీఐ(ఎం) పార్టీ కొన్నేళ్లుగా దోచుకుందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విమర్శలు గుప్పించారు.

Updated : 08 Feb 2023 06:35 IST

త్రిపురలో సీపీఐ(ఎం) పార్టీపై రాజ్‌నాథ్‌ విమర్శలు
రాష్ట్రాన్ని విభజించే ప్రసక్తే లేదని హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్య

కైలాష్‌హర్‌: త్రిపుర ప్రజలను సీపీఐ(ఎం) పార్టీ కొన్నేళ్లుగా దోచుకుందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విమర్శలు గుప్పించారు. ఈ నెల 16న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉనాకోటీ జిల్లాలోని కైలాష్‌హర్‌లో మంగళవారం ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ‘‘భాజపా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చాం. ఈశాన్య రాష్ట్రాలు ఇంటర్నెట్‌ సహాయంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. త్రిపుర ఆర్థికంగా ఎదుగుతోంది. భాజపా పాలనలో కరెంట్‌, నీటి సదుపాయం, రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. సీపీఐ(ఎం) ప్రభుత్వం ప్రజలను దోచుకుంది. వారు పేదవారి కోసం ఏమీ చేయలేదు. ప్రజలు భాజపాను జీరో నుంచి హీరో చేశారు. వారి(గత ప్రభుత్వం) కాలంలో మహిళలకు గౌరవం ఉండేది కాదు. మా పాలనలో మహిళలకు గౌరవంతో పాటు ప్రయోజనాలు దక్కాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ బలపడింది. ఇప్పుడు భారతదేశం చెప్పాలనుకుంటున్నది ప్రపంచం వింటోంది’’ అని వ్యాఖ్యానించారు.

* సెపాహిజాలా జిల్లాలోని మలాఘర్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. ‘‘త్రిపుర ప్రాదేశిక సమగ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితిలో విభజించే ప్రసక్తే లేదు. ప్రదోత్‌ దేబ్బర్మా గ్రేటర్‌ తిప్రరలాండ్‌కు డిమాండ్‌ చేస్తున్నారు. రాజకీయంగా,  సామాజికంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా రాష్ట్రానికి ఏది ఇవ్వడానికైనా సిద్ధమే. కానీ రాష్ట్ర విభజన విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ఆయనకు చెప్పాను’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని