‘పవర్‌’ గురించే ప్రతిపక్షాల బాధ

ఆదాయం ఎలా సమకూర్చుకుంటారని కొందరు సభ్యులు అడిగారు. ప్రజలపై ఎలాంటి పన్నులు వేయం. నిరర్థక ఆస్తులు, ప్రజలకు అవసరం లేనివి తగ్గించి ఆదాయం పెంచుకునే అంశాలను గుర్తించడానికి మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది.

Published : 09 Feb 2023 05:58 IST

సాగుకు 24 గంటల విద్యుత్తుతో వారిలో ఆందోళన
తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయ రంగంపై రూ.92 వేల కోట్ల ఖర్చు
కృష్ణా జలాల్లో వాటా సాధిస్తాం
భాజపాది అదానీ సిద్ధాంతమే
అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శం
బడ్జెట్‌పై చర్చలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు


ప్రజలపై ఎలాంటి పన్నులు వేయం

ఆదాయం ఎలా సమకూర్చుకుంటారని కొందరు సభ్యులు అడిగారు. ప్రజలపై ఎలాంటి పన్నులు వేయం. నిరర్థక ఆస్తులు, ప్రజలకు అవసరం లేనివి తగ్గించి ఆదాయం పెంచుకునే అంశాలను గుర్తించడానికి మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది. ఇది వారానికి ఒకసారి సమావేశమవుతుంది. వచ్చే జూన్‌కల్లా రూ.20 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.    

హరీశ్‌రావు


ఆ నిధులిచ్చే వరకూ కేంద్రాన్ని వదలం

రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.1,27,109 కోట్ల బకాయిలు రావాలి. బోరుబావులకు మీటర్లు పెట్టలేదన్న కారణంగా గత మూడేళ్లుగా రూ.16,653 కోట్లు ఆపారు. జీఎస్టీ బకాయిలు రూ.2,437 కోట్లను ఇప్పటికీ విడుదల చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సిన రూ.17,800 కోట్లు ఇప్పించలేదు. పొరపాటున ఏపీ ఖాతాలో పడ్డ రూ.495 కోట్లు ఇప్పించాలంటూ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే లేడు. మిషన్‌ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా అతీగతీ లేదు. ఈ నిధులు ఇచ్చేవరకూ వదిలే ప్రసక్తే లేదు.

మంత్రి హరీశ్‌రావు


ఈనాడు, హైదరాబాద్‌: అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న అనేక పథకాలను దేశం అనుసరిస్తుండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలతో అన్ని రంగాల్లోనూ తిరోగమనంలో ఉందని ధ్వజమెత్తారు. శాసనసభలో బడ్జెట్‌పై బుధవారం జరిగిన సాధారణ చర్చకు ఆయన సమాధానమిచ్చారు. బడ్జెట్‌పై ప్రతిపక్షాలు ఒక్క విలువైన సూచన కూడా చేయలేదని.. ఒక్క మంచిమాట కూడా చెప్పలేదని విమర్శించారు. నిండు పున్నమిలో చందమామ వెలుగులకు బదులు మచ్చలు వెతికేలా వారి మాటలున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ముందుచూపుతో చేపట్టిన, యుద్ధప్రాతిపదికన పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టుల ఫలమే అభివృద్ధి అని.. దేశంలోనే అత్యధిక వలసలున్న పాలమూరు కూడా సస్యశ్యామలమైందని మంత్రి అన్నారు.

అది రైతులపై ప్రతీకారమే

‘‘ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై పదేళ్ల కాలంలో రూ.8 వేల కోట్లు ఖర్చుపెడితే తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.92 వేల కోట్లు వెచ్చించాం. కేంద్రం మాత్రం ప్రస్తుత బడ్జెట్‌లో ఎరువుల రాయితీ, ఫసల్‌బీమా తగ్గించింది. పత్తి కొనుగోలు, మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌కు రూ.లక్ష చొప్పున మాత్రమే కేటాయించింది. వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు నిరసన తెలిపినందుకు రైతాంగంపై కేంద్రం ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు అనిపిస్తోంది. కేంద్రం గడచిన ఆరేళ్లలో రూ.19,34,304 కోట్ల కార్పొరేట్‌ రుణాలు మాఫీ చేసి.. వారిపై ప్రేమను చాటుకుంది. పేదవర్గాలపై మాత్రం ప్రతాపం చూపిస్తూ.. సిలిండర్‌ ధరను రూ.1,200, పెట్రోల్‌ను రూ.వంద దాటించింది.

రాష్ట్రాలను బలహీనపరిచే కుట్ర

ఆర్థిక రంగంలో తెలంగాణ పురోగమిస్తుంటే కేంద్రం తిరోగమిస్తోంది. రాష్ట్ర జీఎస్డీపీలో అప్పుల వాటా 24.3 శాతం నుంచి 23.8 శాతానికి తగ్గింది. దేశ జీడీపీలో కేంద్రం అప్పుల వాటా 55.9 నుంచి 56.2 శాతానికి పెరిగింది. రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల పేరిట కోత పెడుతూ.. తాను మాత్రం ఉల్లంఘిస్తోంది. ఇదంతా రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రే. (ఈటల రాజేందర్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి చేసిన ప్రసంగాన్ని హరీశ్‌రావు ఈ సందర్భంగా తన ఐప్యాడ్‌ ద్వారా వినిపించారు.)

24 గంటల కరెంట్‌తో ఇద్దరికే బాధ

రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్‌ ఇస్తుంటే.. ఇద్దరే బాధపడుతున్నారు. ఒకరు మోటార్లకు వైండింగ్‌ వేసే మెకానిక్‌లు కాగా.. మరొకరు ప్రతిపక్షాలు. మేం పవర్‌ ఇస్తే.. తమకు ‘పవర్‌’(అధికారం) రాదన్నది వారి బాధ. పొరుగున ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారు ఉన్న మహారాష్ట్రలోని రైతులు సైతం సరిహద్దులోని తెలంగాణ ప్రాంతంలో కొంత భూమి కొని మోటార్లతో నీటిని తమ రాష్ట్రంలోని భూములకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి రేటు రెండు రెట్లు పెరిగింది. నాడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. నేడు ఆత్మగౌరవంతో జీవించేలా చేశాం. వారిని దుర్భర స్థితి నుంచి ఆత్మనిర్భర్‌ స్థితికి తెచ్చాం. జీఎస్‌డీపీలో వ్యవసాయ వాటాను 18 శాతానికి పెంచాం.

కృష్ణా జలాల్లో వాటాపై మళ్లీ కేసు వేస్తాం

ఒకప్పుడు చైనాలో ఏదైనా పనిని వేగంగా పూర్తి చేస్తే వింతగా చెప్పుకొనేవాళ్లం. మనమూ వేగంగా చేయొచ్చని ఇప్పుడు సీఎం కేసీఆర్‌ నిరూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నర సంవత్సరాల్లో పూర్తిచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కొందరు కేసులు వేసి అడ్డుకుంటున్నారు. అయినా 60 శాతం పనులు పూర్తి చేశాం. ఎలాగైనా నిర్మిస్తాం. కృష్ణా వాటా తేల్చాలని సుప్రీం కోర్టులో వేసిన కేసును కేంద్రం సూచన మేరకు విరమించుకున్నాం. పది నెలలైనా ఏదీ తేల్చలేదు. మరికొంతకాలం వేచిచూసి.. మళ్లీ కేసు వేస్తాం. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా సాధిస్తాం.

కంటి వెలుగులో ప్రతిపక్షాలు పరీక్షలు చేయించుకోవాలి

పేదలకు ప్రభుత్వ వైద్యం అందుతున్న రాష్ట్రాల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా.. ఉత్తర్‌ప్రదేశ్‌ చివరిస్థానంలో ఉంది. ఇలాంటివి ప్రతిపక్షాలకు కనపడవు. కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు చేయించుకుంటేనైనా ఈ అభివృద్ధి కనిపిస్తుంది.

వైఫల్యాల్లో భాజపా విజయవంతం

భాజపా సాధించిన విజయాలు కూడా ఉన్నాయి. జీడీపీని మంటగలపడం, ఆహార భద్రతను నాశనం చేయడం, కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రూ.160 లక్షల కోట్ల అప్పులు చేయడం, సెస్‌ రూపంలో అడ్డగోలుగా వసూలు చేయడం, పసిపిల్లలు తాగే పాలపైనా జీఎస్టీ వేయడం, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడం.. ఈ వైఫల్యాల్లో కేంద్రం విజయవంతమైంది. అంత్యోదయ సిద్ధాంతానికి భాజపా నీళ్లొదిలి అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తోంది’’ అని హరీశ్‌రావు విమర్శించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన సందేహాలకు హరీశ్‌రావు సమాధానమిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు చెల్లించడం, పీఆర్‌సీ వేయడం వంటివి విధానపరమైన అంశాలని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. త్వరలో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ క్రీడా విధానాన్ని ప్రకటిస్తారని చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం కట్టే విషయం న్యాయస్థానంలో ఉందని మంత్రి గుర్తుచేశారు.

ప్రగతి పథంలో తెలంగాణ

తెలంగాణ ప్రగతి పథంలో సాగుతోందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. కేంద్రం సహకరించకపోయినా వృద్ధి రేటులో ముందంజలో ఉందన్నారు. భారాస ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తోందో పత్రికల్లో, టీవీల్లో నిత్యం చూస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా కళ్లముందే కనిపిస్తోందని.. అయినా ప్రతిపక్షాలకు అది కనిపించడం లేదంటే కంటిచూపు సమస్య ఉందన్నది స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు.


మా బడ్జెట్‌లో ఉందిదీ

* వృద్ధులకు రక్షణ.. పసివాళ్లకు పోషణ.. బడిపిల్లలకు శిక్షణ.. ఉన్నత విద్యకు ఉపకారం.. యువతకు ఉద్యోగ కల్పన ఉంది

* ఆరిపోని కరెంట్‌ వెలుగులున్నాయి.. నదీజలాల్ని ఎత్తిపోసే విజయాలున్నాయి.. మత్తడి దుంకుతున్న చెరువుల తళతళలున్నాయి.. చెరువులో చేపపిల్లల మిలమిలలున్నాయి.. జలరాశుల గలగలలున్నాయి.. ధాన్యరాశుల కళకళలున్నాయి..

* రైతుల ముఖంపై విరబూస్తున్న చిరునవ్వులున్నాయి.. గొర్లమందల అరుపులున్నాయి.. గొర్ల కురుముల కళ్లలో మెరుపులున్నాయి.. నేతన్నకు భరోసా ఉంది.. గీతన్నకు కులాసా ఉంది.. దళితబంధు ఇచ్చే దిలాసా ఉంది..

* ఆకుపచ్చని అడవులున్నాయి.. మళ్లీ ఊపిరి పోసుకున్న పక్షిజాతులున్నాయి.. కాలుష్యంపై కదనముంది.. పర్యావరణ సమతుల్యముంది..

* పేదింటి ఆడపిల్లల పెళ్లిపందిళ్లు ఉన్నాయి.. వారి తల్లిదండ్రుల కళ్లలో ఆనందబాష్పాలున్నాయి..

మంత్రి హరీశ్‌రావు


కేంద్రానికి తెలంగాణ నుంచి గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో రూ.4.25 లక్షల కోట్ల పన్నులు వెళ్తే.. తిరిగొచ్చింది రూ.1.90 లక్షల కోట్లేనని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అది కేవలం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఇచ్చిందే. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్వహణ, పౌరసరఫరాలు, ఎరువుల రాయితీ, పీఎం కిసాన్‌ తదితరాలన్నింటినీ కలిపితే రూ.5 లక్షల కోట్ల వరకు ఇచ్చింది.

ఈటల రాజేందర్‌


బడ్జెట్‌ అంకెలు చాలా పెద్దగా ఉన్నాయి. ఎంత అంటే.. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అంత ఎత్తున ఉన్నాయి. ఆ అంకెలన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయి.2014లో రూ.లక్ష కోట్లు ఉన్న బడ్జెట్‌ను ఎనిమిదేళ్లలో రూ.2.93 లక్షల కోట్లకు పెంచారు. అంత ఎలా వస్తుంది? మరోవైపు, దేశ సంపదను అదానీకి కేంద్రం పంచిపెడుతోంది.

భట్టి విక్రమార్క


రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోంది. రాష్ట్రాల అప్పులపై ఆంక్షలు విధిస్తోంది. కేంద్రం రోజూ భారీఎత్తున అప్పులు చేస్తోంది. రాష్ట్రం తీసుకునే రుణాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇస్తామని గతంలో ప్రకటించారు. ఇంతవరకు ఇవ్వలేదు.

అక్బరుద్దీన్‌ ఒవైసీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని