Nara Lokesh-Yuvagalam: అర్చకులు.. పురోహితులకు గౌరవ వేతనం ఇస్తాం

తెదేపా అధికారంలోకి రాగానే అర్చకులు, పురోహితులకు గౌరవ వేతనం ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల నిర్మాణానికి, నిర్వహణకు ప్రభుత్వ నిధులు అందిస్తామని ఆ పార్టీ  ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Updated : 19 Mar 2023 06:35 IST

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మిస్తాం
‘యువగళం’లో నారా లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, కదిరి: తెదేపా అధికారంలోకి రాగానే అర్చకులు, పురోహితులకు గౌరవ వేతనం ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల నిర్మాణానికి, నిర్వహణకు ప్రభుత్వ నిధులు అందిస్తామని ఆ పార్టీ  ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. పాదయాత్రలో వివిధ వర్గాల నుంచి వచ్చిన విన్నపాలను పరిగణనలోకి తీసుకుని లోకేశ్‌ పైవిధంగా స్పందించారు. ‘యువగళం’లో భాగంగా 46వ రోజు శనివారం శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో లోకేశ్‌ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా తనకల్లు మండలంలో ఎస్టీ సామాజిక వర్గం ప్రతినిధులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. లోకేశ్‌ మాట్లాడుతూ ‘500 జనాభా ఉన్న తండాలు, గూడేలను పంచాయతీలుగా గుర్తిస్తామని, ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. ఎస్టీల భూముల్ని కబ్జా చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే జీవో-3ని అమలు చేయకపోవడంతో గిరిజన యువత తీవ్రంగా నష్టపోతున్నారు’ అని విమర్శించారు. ‘ అధికారంలోకి రాగానే కాపులు, బలిజలకు అండగా నిలబడి న్యాయం చేస్తాం’ అని తనను కలిసిన బలిజ సామాజిక వర్గ ప్రతినిధులకు లోకేశ్‌ హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో రూ.40 లక్షల సాయం అందించి కాలేయ మార్పిడి చేయించి తమ బిడ్డ జ్ఞానసాయిని కాపాడారని అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం ఆర్‌.ఎస్‌.కొత్తపల్లికి చెందిన బాలిక తల్లిదండ్రులు లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డకు ఇస్తున్న పింఛన్‌ను వైకాపా అధికారంలోకి వచ్చాక రద్దు చేశారని వాపోయారు. జగన్‌ పాలనలో మహిళలకు రక్షణ కరవైందని తనకల్లు మండలం గందోడివారిపల్లికి చెందిన శశికళ... లోకేశ్‌ ఎదుట విలపించారు. తన ఇంటి పక్కనే ఉన్న వైకాపా నేత తమపై దాడి చేశాడని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. స్థానిక తెదేపా నేతలు అండగా ఉంటారని ఆమెకు లోకేశ్‌ భరోసా ఇచ్చారు.

భుజం నొప్పితో ఇబ్బంది...

శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోకి ప్రవేశించిన సమయంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు లోకేశ్‌కు స్వాగతం పలకడానికి పోటీపడ్డారు. ఈ తోపులాటలో జనం మీద పడటంతో లోకేశ్‌ కుడిభుజం నొక్కుకుపోయింది. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. నొప్పి బాధిస్తున్నప్పటికీ లోకేశ్‌ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.  మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌, నేతలు తిప్పేస్వామి, అత్తార్‌ చాంద్‌బాషా, బండారు శ్రావణి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు