అదానీ వ్యవహారంలో సమాధానం చెప్పలేకే సభల వాయిదా..

అదానీ వ్యవహారంలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేకనే ఉభయ సభలను వాయిదా వేస్తున్నారని భారాస ఎంపీలు విమర్శించారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చను చేపట్టాలంటూ పార్లమెంటు ఉభయసభల్లో భారాస ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతులు సోమవారం తిరస్కరించారు.

Published : 21 Mar 2023 04:21 IST

కేంద్రంపై భారాస ఎంపీల విమర్శలు

ఈనాడు, దిల్లీ: అదానీ వ్యవహారంలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేకనే ఉభయ సభలను వాయిదా వేస్తున్నారని భారాస ఎంపీలు విమర్శించారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చను చేపట్టాలంటూ పార్లమెంటు ఉభయసభల్లో భారాస ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతులు సోమవారం తిరస్కరించారు. సభల వాయిదా అనంతరం ఇతర విపక్ష పార్టీల సభ్యులతో కలిసి భారాస ఎంపీలు విజయ్‌చౌక్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అదానీ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై వెంటనే సంయుక్త పార్లమెంటరీ బృందంతో విచారణ చేయించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అదానీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు పార్లమెంటును వాయిదా వేసుకుంటూ వెళుతోందన్నారు. ప్రతిపక్షాల ఆందోళనను పట్టించుకోకుండా సభను వాయిదావేస్తూ తానే ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్న వింత పరిస్థితి నెలకొందని విమర్శించారు. దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరును దేశ ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్ష ఉప నేత కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీలు గడ్డం రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్‌, వెంకటేష్‌ నేత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పి.రాములు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని