ఐటీ నాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది

తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఆదాయపు పన్ను విభాగం క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని, దర్యాప్తును అప్పుడే ముగించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజేశ్‌ కిలారు పేర్కొన్నారు.

Published : 26 Mar 2023 05:25 IST

తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి రాజేశ్‌ కిలారు

ఈనాడు, అమరావతి: తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఆదాయపు పన్ను విభాగం క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని, దర్యాప్తును అప్పుడే ముగించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజేశ్‌ కిలారు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను సోదాల్లో గానీ, తర్వాత ఇచ్చిన నోటీసుల్లోగానీ తనకు ఈ వ్యవహారాల్లో ఎలాంటి సంబంధం లేదని తేల్చి దర్యాప్తును ముగించారని వివరించారు. తన చిత్తశుద్ధి, నిజాయతీకి ఇదే నిదర్శనమన్నారు. ‘ఆదాయపు పన్ను విభాగం సోదాల్లో భాగంగా ఏడేళ్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లను పరిశీలించి రీఅసెస్‌మెంట్‌ చేశారు. ఆరేళ్ల రిటర్న్‌లను ఆమోదించారు. ఒక్క ఏడాదిలో మాత్రం పూర్వీకుల నుంచి వచ్చి వ్యవసాయ భూమి అమ్మకంపై క్యాపిటల్‌ గెయిన్స్‌ పూర్తిగా కట్టలేదని నోటీసులు ఇచ్చారు. అది వ్యవసాయ భూమి అని, క్యాపిటల్‌ గెయిన్స్‌ వర్తించదని అప్పీల్‌ చేశాను. ఈ వ్యవహారం తప్పించి ఐటీ విభాగం నాపై ఎలాంటి ఆరోపణ చేయలేదు’ అని శనివారం విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ‘వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాపై అక్రమ కేసులు బనాయించడానికి ప్రయత్నిస్తోంది. తప్పుడు ఆరోపణలతో ఐటీ దాడులు చేయించారు. రాజకీయ ప్రయోజనాల కోసం నా వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సాక్షిలో ప్రచారం చేస్తున్నారు. శాసనసభలో చేయని ఆరోపణలను కూడా చేసినట్లు ప్రచురించినందుకు లీగల్‌ నోటీసులు పంపిస్తున్నాను’ అని రాజేశ్‌ కిలారు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని