ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలకు విలువ లేదు

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థికి ఓటేసిన తర్వాత కుమార్తెతో వచ్చి సీఎం జగన్‌తో ఫొటో తీయించుకున్నారని, వైకాపా అభ్యర్థికి ఓటేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు.

Updated : 27 Mar 2023 08:43 IST

మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, ఆదిమూలపు సురేష్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థికి ఓటేసిన తర్వాత కుమార్తెతో వచ్చి సీఎం జగన్‌తో ఫొటో తీయించుకున్నారని, వైకాపా అభ్యర్థికి ఓటేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. ఆమె మాటలకు విలువలేదని, అలాంటి వారి గురించి మాట్లాడుకుని సమయం వృథా చేసుకోవడం అనవసరమని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మరో మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి విశాఖలో విలేకర్లతో మాట్లాడారు. ‘డబ్బుకు అమ్ముడుపోయి నీతులు చెబితే వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కులం కార్డు అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని, పార్టీని, సీఎంను నిందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు ప్రజాబలం లేకపోవడంతోనే వచ్చే ఎన్నికల్లో జగన్‌ సీటు ఇవ్వనని చెప్పేశారు’ అని అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

ఇన్నాళ్లూ ఎందుకు మాట్లాడలేదు

పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ ‘శ్రీదేవి చేసిందంతా చేసి సీఎం దళితులను అవమానిస్తున్నారని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. అదే నిజమైతే నాలుగేళ్లుగా ఎందుకు మాట్లాడలేదు? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థులు ఆరుగురు గెలుపొందారు. ఒక స్థానం తెదేపా సొంతమైంది. ఎవరిది గొప్ప విజయం. మాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే 152 ఓట్లు వచ్చాయి’ అని చెప్పారు. తెదేపాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన విషయంపై విలేకరులు ప్రశ్నించగా తమ ఆశయాలు నచ్చి వారే ఓటేశారని, తాము ఎవరినీ కొనలేదని సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని