సాయం ప్రకటించిన కేసీఆర్‌పై విమర్శలా?

‘రాష్ట్రంలో వడగళ్లతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తే భాజపా నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది.

Published : 27 Mar 2023 03:42 IST

ప్రగల్భాలు మాని చేతనైతే రైతులను కేంద్రం ద్వారా కూడా ఆదుకోండి
భాజపా నేతలకు మంత్రి హరీశ్‌ హితవు

సిద్దిపేట, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో వడగళ్లతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తే భాజపా నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. ప్రగల్భాలు పలికే బదులు దిల్లీ నుంచి ఆర్థిక సాయం రాబట్టాలి. చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపోయిన వారికి మంజూరు చేయించాలి. తద్వారా ఎకరానికి రూ.20 వేలు ఇద్దాం’ అని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 763 మంది రైతులకు తుంపర సేద్యం పరికరాలను జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద డబ్బులు లేక కొంత ఇబ్బంది ఉన్నా వడగళ్ల బాధిత రైతుల కోసం రూ.228 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిందన్నారు. భాజపా నేతలు టీవీల ముందు కూర్చొని మాట్లాడటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. నల్ల చట్టాలతో 800 మంది రైతులను భాజపా ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని, బోరుబావుల వద్ద మీటర్లు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తోందన్నారు. మీటర్లు పెట్టలేదని రూ.30 వేల కోట్లు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆపిందన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో మీటర్లు పెట్టుకొని నిధులు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. వడ్లు కొనకుండా చేతులు ఎత్తేసిన చరిత్ర ఆ పార్టీది.. పెట్రోలు, డీజిల్‌, ఎరువులు ధరల పెంపుతో అన్నదాతల పెట్టుబడిని రెండింతలు చేశారని దుయ్యబట్టారు. తుంపర, బిందు సేద్యం పరికరాలపై జీఎస్టీ విధించడంతో వాటి ధర పెరిగిందని తెలిపారు. దేశం మొత్తం యాసంగిలో వరి పంట 92 లక్షల ఎకరాల్లో సాగయితే తెలంగాణలో 56 లక్షల మేర ఉందని పేర్కొన్నారు. అన్నదాతలకు ఎంతో మేలు చేస్తున్న కేసీఆర్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, ఏఎంసీ అధ్యక్షురాలు మచ్చ విజిత, సుడా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని