సొంతగూటికి డీఎస్‌.. తనయుడు సంజయ్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరిక

మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) తిరిగి సొంత గూటికి చేరారు. ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Updated : 27 Mar 2023 06:03 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) తిరిగి సొంత గూటికి చేరారు. ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారు ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీఎస్‌తో పాటు ఆయన తనయుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఇతర సీనియర్‌ నేతలు డీఎస్‌కు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. డీఎస్‌ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పని చేసిన సమయంలో పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. అంతకుముందు వీల్‌ఛైర్‌లో గాంధీభవన్‌కు చేరుకున్న డీఎస్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తిరిగి కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందని, గాంధీభవన్‌లో అడుగుపెట్టడం సొంతింటికి వచ్చినట్లుందన్నారు. కాంగ్రెస్‌లో చేరడం లేదని తన పేరు మీద విడుదలైన ప్రకటనతో సంబంధం లేదని, ఆ లేఖ ఎవరు రాశారో తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా డీఎస్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో భారాసలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని