ఏపీ పునర్నిర్మాణం మా బాధ్యత
ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి నాంది పలికి, దాన్ని బాగు చేసే బాధ్యతను తెదేపా తీసుకుంటుందని చెప్పారు.
సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధికి ప్రాధాన్యం
పేదల్ని ధనవంతులుగా చేసేందుకు సంకల్పం
తెదేపా ఆవిర్భావ దినోత్సవ సభలో చంద్రబాబు వెల్లడి
అభివృద్ధి చెందినవారు కొన్ని కుటుంబాల్ని దత్తత తీసుకోవాలని పిలుపు
జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం
అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ధ్వజం
ఈనాడు - హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి నాంది పలికి, దాన్ని బాగు చేసే బాధ్యతను తెదేపా తీసుకుంటుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగించడంతో పాటు, అభివృద్ధికీ అత్యధిక ప్రాధాన్యమిస్తామన్నారు. ‘సంక్షేమం ప్లస్ అభివృద్ధి’ అన్న విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సంపద సృష్టించడంతో పాటు, అభివృద్ధి ఫలాలు పేదలకు అందేలా చేయాలన్నదే తమ సంకల్పమన్నారు. సంస్కరణల ఫలాల్ని అందిపుచ్చుకుని జీవితంలో ఆర్థికంగా స్థిరపడినవారు కొన్ని పేద కుటుంబాల్ని దత్తత తీసుకుని వారి అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. తెదేపా అధికారంలోకి వచ్చాక దీన్నో ఉద్యమంలా చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర విభజన కంటే సైకో ముఖ్యమంత్రి జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నష్టం జరిగిందని, రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కు పోయిందని ధ్వజమెత్తారు. ‘ఈ నాలుగేళ్లలో వాళ్లు చేసింది ఒక్కటే.. ఎక్కడో బిహార్‌లో ఉంటుందనే గన్ కల్చర్‌ను ఇప్పుడు జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల దాకా తెచ్చారు. మొన్న గొడ్డలి... ఇప్పుడు గన్, మూడోది గంజాయి’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘ఏపీలో తిరుగుబాటు మొదలైంది. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో తెదేపాను భారీ మెజారిటీతో గెలిపించారు. అది చదువుకున్నవాళ్లలో వచ్చిన తిరుగుబాటు. రేపు ప్రజలందరిలోనూ అదే తిరుగుబాటును చూడబోతున్నాం’ అని తెలిపారు. తెలంగాణలోనూ పార్టీకి పూర్వవైభవం తేవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ!
కక్ష కట్టి అమరావతిని నాశనం చేశారు
హైదరాబాద్‌కు దీటుగా మరో నగరం వస్తే తెలుగుజాతి గర్వపడుతుందని అమరావతి నిర్మాణం ప్రారంభించాను. కానీ జగన్ దానిపై కక్షకట్టి నాశనం చేశారు. అమరావతి నా కోసమా? నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌లో, హైటెక్ సిటీలో నేనేమైనా ఉద్యోగం చేస్తున్నానా? మా పిల్లలేమైనా ఐఎస్‌బీలో చదువుతున్నారా? అమరావతి నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు. దాన్ని జగన్ సర్వనాశనం చేసి, నాలుగేళ్లుగా రాజధానిపై మూడు ముక్కలాట ఆడుతున్నారు. ఈ విధ్వంసాన్ని తెలుగువారు ఎక్కడున్నా ఖండించాలి. అప్పట్లో శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణానికి రైతుల నుంచి అయిదు వేల ఎకరాలు సేకరించాను. నా తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి విమానాశ్రయాన్ని రద్దు చేసి ఉంటే, ఈ రోజున అక్కడంత అభివృద్ధి జరిగేదా? ఏడేళ్ల క్రితం తెదేపా ఆవిర్భావం రోజునే పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేశాం. దేశంలోనే మొదటిసారి నదుల అనుసంధానం చేశాం. కృష్ణా, గోదావరి జలాల్ని సద్వినియోగం చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి ఎకరాకీ నీరిచ్చి సస్యశ్యామలం చేయొచ్చు. కానీ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
హైటెక్ సిటీని కూల్చేస్తే అభివృద్ధి జరిగేదా?
హైదరాబాద్‌లో నేను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల్నీ, ప్రాజెక్టుల్నీ.. నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా కొనసాగించారు. దానికి కేసీఆర్ సహా అందర్నీ అభినందిస్తున్నాను. హైటెక్ సిటీని నేను కట్టానని.. వైఎస్ దాన్ని కూల్చేస్తే హైదరాబాద్ అభివృద్ధి జరిగేదా? అవుటర్‌రింగ్ రోడ్డును రద్దు చేసి ఉంటే హైదరాబాద్‌కు ఈ వైభవం వచ్చేదా? జీనోమ్ వ్యాలీ వల్ల నాకు పేరొస్తుందనుకుని దాన్ని ఆపేసి ఉంటే.. ఈ రోజు కొవిడ్‌కు వ్యాక్సిన్ తయారు చేయగలిగేవారమా? మెట్రో ప్రాజెక్టును వైఎస్ చెడగొడితే.. రోశయ్య గాడిన పెట్టారు. ఈ రోజు శంషాబాద్ విమానాశ్రయాన్ని నేనే అభివృద్ధి చేశానని, అవుటర్‌రింగ్‌రోడ్డు నా వల్లే వచ్చిందని ఎవరూ చెప్పకపోవచ్చు. కానీ మనస్సాక్షిగా పనిచేశానన్న తృప్తి నాకు ఉంటుంది. రాష్ట్రంలో 30 ఇంజినీరింగ్ కళాశాలలను 300కి పెంచాను. వాటి అనుమతుల కోసం ఫైళ్లు పట్టుకుని దిల్లీలో కార్యాలయాల చుట్టూ తిరిగాను. ఫలితంగా ఈ రోజున కొన్ని లక్షల మంది పిల్లలు ఇంజినీరింగ్ చదువుతున్నారు. అతి కష్టం మీద బిల్‌గేట్స్ అపాయింట్‌మెంట్ తీసుకుని మాట్లాడి, సియాటెల్‌కు, దావోస్‌కి పదిసార్లు తిరిగి ఆయన్ను ఒప్పించి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ పెట్టేలా చేశాను. ఐఎస్‌బీ కోసం నాలుగు రాష్ట్రాలు పోటీపడితే... దాన్ని ఏర్పాటుచేస్తున్న పారిశ్రామికవేత్తల్ని ఇంటికి పిలిచి, నేనే స్వయంగా వారికి ప్లేట్లు అందించి, అల్పాహారం వడ్డించాను. తెలుగు జాతి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసమే అదంతా చేశానని గర్వపడుతున్నాను.
తెలుగువారు ప్రపంచ నాయకులుగా ఎదగాలి
తెలుగువారు ప్రపంచ పౌరుల్లా (గ్లోబల్ సిటిజెన్స్) మారారు. భవిష్యత్తులో వారు ప్రపంచ నాయకులు (గ్లోబల్ లీడర్లు)గా ఎదగాలి. 2047 నాటికి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జాతి.. యూదులు కాదని, తెలుగువారేనన్న గుర్తింపు తెచ్చుకోవాలి. తెలంగాణ ఇప్పుడున్న స్థాయి నుంచి మరో స్థాయికి ఎదగాలి. ఏపీలో పునర్నిర్మాణం చేసి, పూర్వ వైభవం తేవాలి.
పేద కుటుంబాల్ని దత్తత తీసుకోండి
ఆర్థిక సంస్కరణలు, నాలెడ్జ్ ఎకానమీతో సంపద సృష్టి జరుగుతున్నా అది కొందరికే పరిమితమవుతోంది. 12 శాతం కుటుంబాలకు రోజుకు రూ.150, 22 శాతం జనాభాకు రోజుకు రూ.350 మాత్రమే వస్తోంది. ఒక శాతం జనాభా 62 శాతం సంపదను అనుభవిస్తుంటే, 12 శాతం జనాభా కడు పేదరికంలో ఉన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు నిర్మూలించే కార్యక్రమానికి ఈ రోజే నాంది పలకాలి. మేధావులు, డబ్బున్నవారు, అవకాశాలు అందిపుచ్చుకున్నవారు మనందరం కలసి నిరుపేదలకు అండగా ఉండాలి. అయిదేళ్లకు కొందరి తలసరి ఆదాయం వంద రెట్లు పెరిగితే, పేదల ఆదాయం మూడు రెట్లే పెరుగుతోంది. దాన్ని 30-40 రెట్లు పెంచే బాధ్యత నాది. పది కోట్ల మంది తెలుగువారిలో రెండు కోట్ల మందో, మూడు కోట్ల మందో పేదరికంలోనే ఉన్నారు. మీ శక్తినిబట్టి అలాంటి అయిదో, పదో కుటుంబాల్ని దత్తత తీసుకోండి. వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయండి. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఒక స్పష్టమైన ప్రణాళికలను అందజేస్తాం.
విరాళాలిచ్చి పార్టీకి అండగా నిలవండి
మీరంతా తెదేపా కోసం పనిచేయాలి. హైదరాబాద్‌లోనో, అమెరికాలోనో ఉన్నవారు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ రూ.5 వేలు కట్టి, పార్టీ శాశ్వత సభ్యులై రాజకీయాల్ని మరింత క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆన్‌లైన్‌లోనే బటన్ నొక్కి తెదేపా సభ్యత్వం తీసుకోవచ్చు. నెలకు కనీసం వంద రూపాయలో, యాభై రూపాయలో పార్టీకి విరాళంగా ఇవ్వండి. అది పార్టీ కోసం ప్రాణత్యాగాలకూ సిద్ధపడే కార్యకర్తల సంక్షేమానికి ఉపయోగపడుతుంది.
దేశం దశ, దిశ మార్చిన నాయకుడు పీవీ
సంస్కరణలకు నాంది పలికి.. దేశం దశ, దిశను మార్చిన తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు. 1991లో ఆయన హయాంలోనే ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. 1992-93లో ఇంటర్నెట్ విప్లవం వచ్చింది. 1995లో నేను ముఖ్యమంత్రయ్యాక.. ఆ రెండూ అందిపుచ్చుకుంటే ప్రపంచంలో తెలుగు జాతికి తిరుగుండదని గుర్తించాం. పీవీ ప్రారంభించిన సంస్కరణలకు అదనంగా, నేను రెండో తరం సంస్కరణలు తీసుకొచ్చాను. దానికి టెక్నాలజీని జోడించాను. విద్యుత్, మౌలిక వసతుల రంగాల్లో సంస్కరణలకు నాంది పలికాను.
తెలంగాణలోనూ పూర్వవైభవం వస్తుంది
తెలంగాణలో ఇంటింటికీ తెదేపా కార్యక్రమం బాగా జరుగుతోంది. దానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌ను, ఆయన బృందాన్ని అభినందిస్తున్నాను. బాగా పనిచేస్తున్నారు. దాన్ని ఇంకా ఉద్ధృతం చేయాలి. వేగం పెంచాలి. తెలంగాణలోనూ పార్టీకి తప్పకుండా పూర్వ వైభవం వస్తుంది. అది చారిత్రక అవసరం.
తెలుగుజాతికి గర్వకారణం ఎన్టీఆర్
41 సంవత్సరాల కిందట ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29. తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్. పరిపాలన సంస్కరణలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఆయనే ఆద్యుడు. ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. మొదటిసారి స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారు. నేను దాన్ని 34 శాతానికి పెంచాను. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ రోజు తొలి సమావేశం నిర్వహించాం. మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో మహానాడు జరుగుతుంది. ఈ మధ్యలో 98 సమావేశాలు పెట్టి, యుగపురుషుడు ఎన్టీఆర్‌కి ఘనంగా నివాళులర్పిస్తాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికాలలోనూ సమావేశాలు నిర్వహిస్తాం. ఎన్టీఆర్ గౌరవార్థం వంద రూపాయల వెండి నాణెం విడుదల చేయబోతున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు.
సంపద సృష్టిస్తా.. పేదలకు అందిస్తా
దేశానికి తిండిపెడుతున్న రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. చేనేత కార్మికులు, గొర్రెల కాపర్లు, చర్మకారులు, వడ్రంగి, కుమ్మరి వంటి వృత్తిపనివారు పేదరికంలో మగ్గుతున్నారు. వారందరిలో నైపుణ్యాలు అభివృద్ధి చేస్తాం. వారి ఉత్పత్తులకు మార్కెట్ ఏర్పాటు చేస్తాం. సాధారణ కుటుంబాల్నీ ఆర్థికంగాపైకి తీసుకొస్తాం. తెలుగుజాతి రుణం తీర్చుకుంటాను. ప్రపంచానికే ఒక నమూనాను అందజేస్తాను. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు న్యాయం చేసే బాధ్యత తెదేపాది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Teja: అమ్మానాన్నా చనిపోయాక.. చుట్టాలు మమ్మల్ని పంచుకున్నారు: తేజ
-
Sports News
IPL Final: చెన్నై పాంచ్ పటాకానా..? గుజరాత్ డబుల్ ధమాకానా? ఈ ఐపీఎల్ విజేత ఎవరు..?
-
Education News
TS EAMCET Counselling 2023: తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Crime News
Hyderabad: అబిడ్స్ ట్రూప్ బజార్లో అగ్నిప్రమాదం.. 3 ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది
-
Crime News
Cyber Fraud: ఫ్రీ థాలీ కోసం ఆశపడితే.. రూ.90వేలు పోయే..!
-
Movies News
Salman Khan: నాకు పెళ్లి వయసు దాటిపోయింది: సల్మాన్‌ఖాన్