జగన్‌ది పరదాల యాత్ర.. నాది పాదయాత్ర
‘సీఎం జగన్ తప్పుడు మార్గంలో వెళుతున్నందునే ఎక్కడికెళ్లినా పరదాలు కట్టుకుంటున్నారు. 30 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు.
తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్
ఈనాడు డిజిటల్, అనంతపురం: ‘సీఎం జగన్ తప్పుడు మార్గంలో వెళుతున్నందునే ఎక్కడికెళ్లినా పరదాలు కట్టుకుంటున్నారు. 30 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు. నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టే.. ధైర్యంగా రోడ్లపై తిరుగుతున్నా. జగన్‌మోహన్‌రెడ్డిది పరదాల యాత్ర. నాది పాదయాత్ర’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర 56వ రోజు శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కోనక్రాస్ నుంచి ప్యాదిండి వరకు కొనసాగింది. ప్యాదిండిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. యువగళం పాదయాత్రలో తనపై ఊరికో కేసు పెట్టారని, అంతకుమించి జగన్ చేసేదేమీ లేదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ గళం ఆగదని.. ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ప్రతి హామీని గుర్తుకుచేసి రోడ్డు మీద నిలబెడతామన్నారు. సొంత ప్రయోజనాలు తప్ప.. జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని లోకేశ్ ఆరోపించారు. దిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా కేంద్రాన్ని నిలదీయలేదని పేర్కొన్నారు. 31 మంది ఎంపీలు జగన్‌ను కేసుల నుంచి కాపాడటానికి తప్ప రాష్ట్రం కోసం పోరాడలేదన్నారు. వైకాపా సస్పెండ్ చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రోడ్డుపై కుర్చీ వేసుకుని.. రండి తేల్చుకుందాం అంటూ జగన్‌కే సవాల్ విసిరారన్నారు. జగన్ పనైపోయిందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు.
మావి కియా బస్సులు.. మీవి ఇసుక లారీలు
రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో కియా ఉద్యోగుల్ని తీసుకెళ్తున్న బస్సులతో సెల్ఫీ తీసుకుని ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. అదే క్రమంలో చెన్నేకొత్తపల్లి నుంచి ధర్మవరం వెళ్లే మార్గంలో యాత్ర కొనసాగుతుండగా చిత్రావతి నది నుంచి ఇసుక తరలిస్తున్న 9 లారీలు ఒకదాని వెంబడి మరొకటి వెళ్లాయి. వాటితోనూ లోకేశ్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా సమర్థతకు కియా బస్సులు సాక్ష్యమని.. వైకాపా అవినీతికి అక్రమంగా ఇసుక తీసుకెళ్తున్న లారీలు నిదర్శనమన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నలుగురు బినామీలను ఏర్పాటు చేసుకుని ఇసుకను బెంగళూరుకు తరలిస్తున్నారని ఆరోపించారు.
కప్పం కట్టలేకే జాకీ పరార్
6 వేలమంది మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 2017లో రాప్తాడుకు జాకీ కంపెనీ తీసుకొచ్చామన్నారు. 27 ఎకరాల భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఎన్‌ఎస్ గేటు వద్ద జాకీ పరిశ్రమ భూనిర్వాసితులు, స్థానిక మహిళలు లోకేశ్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి రూ.15 కోట్ల కప్పం కట్టలేకే జాకీ పరిశ్రమ తెలంగాణకు వెళ్లిపోయిందని లోకేశ్ ఆరోపించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దఎత్తున పరిశ్రమలు నెలకొల్పి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. పాదయాత్రలో మాజీ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.
యువనేత కాలికి బొబ్బ
గడిచిన వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండిపోతున్నాయి. అయినా ఎండను ఏమాత్రం లెక్కచేయకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. 55వ రోజు గురువారం జాతీయ రహదారిపై 11.8 కిలోమీటర్లు నడిచారు. అదేరోజు రాత్రి లోకేశ్ కాలికి బొబ్బ వచ్చింది. నొప్పిని పట్టించుకోకుండా శుక్రవారం ఉదయం యథావిధిగా యాత్రను కొనసాగించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Congress: తెలంగాణ ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేసింది: కృష్ణ పూనియా
-
India News
Rujira Narula Banerjee: అభిషేక్ బెనర్జీ భార్యకు చుక్కెదురు.. విమానాశ్రయంలో అడ్డగింత
-
India News
China: భారత్ సరిహద్దుల్లో భారీగా చైనా నిర్మాణాలు: చాథమ్ హౌస్
-
General News
KTR: బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టాం: కేటీఆర్
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ
-
India News
Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి యావజ్జీవ కారాగార శిక్ష