Karnataka Elections: అంతుచిక్కని సిలికాన్‌ నాడి!

కర్ణాటక రాజధాని.. దేశానికి ఐటీ రాజధాని.. అదే సిలికాన్‌ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరు. కానీ దీనికి సమస్యల రాజధాని అనే మరో విశేషణాన్నీ స్థానికులు చేరుస్తుంటారు.

Updated : 21 Apr 2023 10:29 IST

కర్ణాటక రాజధానిపై పట్టుకు పోటాపోటీ
28 నియోజకవర్గాల్లో కీలక సమరం
ఏలికలపై పెరుగుతున్న అసంతృప్తి

కర్ణాటక రాజధాని.. దేశానికి ఐటీ రాజధాని.. అదే సిలికాన్‌ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరు. కానీ దీనికి సమస్యల రాజధాని అనే మరో విశేషణాన్నీ స్థానికులు చేరుస్తుంటారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, మరాఠీ తదితర భాషలు మాట్లాడే ప్రజలందరి నగరంగా నిలిచే బెంగళూరు అత్యధిక అసెంబ్లీ సీట్లున్న ప్రాంతం. ఇక్కడ పట్టు సాధిస్తే రాష్ట్రంలో అధికారానికి చేరువ కావొచ్చన్నది అన్ని పార్టీల ఆశ. కానీ.. ఎవరు గెలిచినా తమ బెంగలు తీరట్లేదన్నది ఈ నగర ప్రజల ఆవేదన. మరి ఈసారి ఈ భారతీయ సిలికాన్‌ వ్యాలీ ఎలా స్పందించబోతోంది?

పాలనపై అసహనం

224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో 12.5% నియోజక వర్గాలు; 20% ఓటర్లున్న ప్రాంతం బెంగళూరు అర్బన్‌ జిల్లా. నగర పరిధిలో 28 నియోజకవర్గాలుండగా.. 80 లక్షల మంది ఓటర్లున్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెరగకపోవడం, అధ్వాన రోడ్లు, గుంతలు, చినుకుపడితే చాలు... జలమయమైపోతున్న రహదారులు, వ్యర్థాల నిర్వహణ లోపం... ట్రాఫిక్‌ ఇబ్బందులు... అన్నింటికీ మించి అవినీతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
కరోనా, వరుసగా రెండేళ్లపాటు విడవని భారీ వర్షాలు బెంగళూరు నగర వాసులను తీవ్ర అసహనానికి గురి చేశాయి. 2022 మార్చి నుంచి మే వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో బెంగళూరులోని 40శాతం ప్రాంతం ముంపునకు గురైంది. ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్‌ ఐటీ క్లస్టర్‌గా ఎదిగిన ఎలక్ట్రానిక్‌ సిటీ మొత్తం వరద నీటితో నిండిపోయింది. ఐటీ కార్యాలయాలున్న మహదేవపుర, బెళ్లందూరు, కోరమంగళ, వైట్‌ఫీల్డ్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డు ప్రాంతాల్లోని ఐటీ కార్యాలయాలన్నీ మునిగిపోయాయి. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, ఓఆర్‌ఆర్‌ ఐటీ సమాఖ్య మధ్య వాగ్వాదాలు, బెంగళూరు మౌలిక సదుపాయాలపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ పదే పదే విమర్శిస్తూ, ఇక్కడి ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తూ సామాజిక మాధ్యమాల్లో గుప్పించిన విమర్శలు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చాయి.

చిన్నపాటి వర్షానికే రహదారులన్నీ గుంతలు పడటంపై బయోకాన్‌, ఇన్ఫోసిస్‌ వంటి దిగ్గజ సంస్థలు ప్రభుత్వాన్ని విమర్శించిన తీరు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వీటితో పాటు బృహత్‌ బెంగళూరు మహా నగర పాలిక (బీబీఎంపీ) ఎన్నికలను నిర్వహించకపోవడంవల్ల నగరాన్ని నిర్లక్ష్యం చేశారనే ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. 2020 సెప్టెంబరు 10నే బీబీఎంపీ కాలపరిమితి ముగిసినా ఇంత వరకూ ఎన్నికలు నిర్వహించలేదు. పదవిలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ వీటి తీవ్రత తగిలేదే అయినా.. అధికార పక్షంలోని వారిపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వంపై అసంతృప్తి భాజపాకు బెంగ కాగా... ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం ఇక్కడి ఓటర్లపై ఎక్కువగా ఉండొచ్చేమోననేది కాంగ్రెస్‌ బెంగ. ఎవరు గెల్చినా... స్వల్ప మెజారిటీలతో గట్టెక్కే అవకాశం ఎక్కువగా ఉండొచ్చని అనుకుంటున్నారు.

పోలింగ్‌ గిట్టదు

పేరుకు కాస్మోపాలిటన్‌ అయినా... భారతీయ సిలికాన్‌ వ్యాలీగా పేరొందినా... ప్రతి ఎన్నికల్లోనూ అతి తక్కువ పోలింగ్‌ నమోదయ్యే నగరం బెంగళూరు. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం, బెంగళూరు గ్రామీణంలో 80 శాతం పోలింగ్‌ నమోదైనా నగరంలో ఏనాడూ 60 శాతానికి మించదు. 2018 విధానసభ ఎన్నికల్లో భోజన విరామ సమయానికి మొత్తం 28 నియోజకవర్గాల్లో కేవలం 10శాతం పోలింగే నమోదు కాగా సాయంత్రానికి 55 శాతానికి చేరుకుంది. వీరిలో కేవలం వృద్ధులు, మధ్య వయస్కులే తప్ప 40ఏళ్లలోపు వారి పోలింగ్‌ 17శాతమే!


కాంగ్రెస్‌ ముందంజ!

పట్టణ ప్రాంతాల్లో భాజపాకు తిరుగులేదని అనుకుంటున్నా.. చరిత్ర చూస్తే ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్‌నూ ఈ ప్రాంతం బాగానే ఆదరిస్తుండటం గమనార్హం. నియోజకవర్గాల పునర్‌విభజన తర్వాత 2008 ఎన్నికల్లో భాజపా 18, కాంగ్రెస్‌ 10 గెల్చుకున్నాయి. ఆ తర్వాతి రెండు ఎన్నికల్లో బెంగళూరులో కాంగ్రెస్‌దే పైచేయి అయింది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే ఎక్కువ వచ్చినా... తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల మార్పులతో భాజపా బలం పెరిగింది. ఈసారీ కాంగ్రెస్‌, భాజపాల మధ్యే పోరు హోరాహోరీగా ఉండబోతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత భాజపా ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. శాంతినగర, బెంగళూరు కేంద్రం, సి.వి.రామన్‌ నగర, పులకేశి నగరలో తమిళ ఓటర్లు ప్రభావం చూపుతుండగా.. మహదేవపుర, బీటీఎం లేవుట్‌, యలహంక, హెబ్బాళ, కేఆర్‌పుర, యశ్వంతపురలో తెలుగు ఓటర్లు, శివాజీనగర, చామరాజపేటెలో ముస్లిం, చిక్కపేటెలో హిందీ ఓటర్లు గెలుపోటములను నిర్ణయిస్తారు.


ప్రభావం చూపే అంశాలు

* పాలనలో అవినీతి

* అభ్యర్థులు, పార్టీల విధానాలు

* ట్రాఫిక్‌, రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, కాలుష్యం లాంటి పౌర సమస్యలు

* బీబీఎంపీ ఎన్నికల వాయిదా

ఈనాడు ప్రత్యేక విభాగం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని