YSRCP - TDP: ఫ్లెక్సీ కట్టారని.. దుకాణం కూల్చేశారు!

గతంలో విశాఖ, అమరావతి ప్రాంతాల్లో కలకలం రేపిన జేసీబీ సంస్కృతి ఇప్పుడు పల్లెలకూ పాకింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఆరుగొలనులో తెదేపా నాయకుడు మాదల శ్రీనివాసరావుకు చెందిన దుకాణ భవనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం ఇలాగే నేలమట్టం చేశారు.

Published : 10 May 2023 09:40 IST

ఆక్రమణలో ఉందని  తెదేపా నాయకుడి దుకాణం నేలమట్టం
రాజకీయ కక్ష సాధింపేనన్న తెదేపా నాయకులు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: గతంలో విశాఖ, అమరావతి ప్రాంతాల్లో కలకలం రేపిన జేసీబీ సంస్కృతి ఇప్పుడు పల్లెలకూ పాకింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఆరుగొలనులో తెదేపా నాయకుడు మాదల శ్రీనివాసరావుకు చెందిన దుకాణ భవనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం ఇలాగే నేలమట్టం చేశారు. ఉదయం జేసీబీతో దుకాణం వద్దకు వెళ్లిన అధికారులు.. ప్రహరీని కూల్చివేశారు. సత్వరమే భవనాన్ని ఖాళీ చేయకుంటే పూర్తిగా కూల్చివేస్తామంటూ హెచ్చరించారు. ఒక్కరోజైనా గడవకముందే అనూహ్యంగా రాత్రి 10 గంటల సమయంలో మరోసారి వచ్చి మొత్తం దుకాణాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. కూల్చివేత సమయంలో ఎవరూ అటుగా రాకుండా పోలీసు బందోబస్తు పెట్టారు. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటనలో ఆయనకు స్వాగతం పలుకుతూ శ్రీనివాసరావు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కారణంగానే ఎమ్మెల్యే వర్గీయులు.. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి కూల్చివేయించారని, ఇది రాజకీయ కక్షసాధింపేనని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

కూల్చే ముందే నోటీసులు

తిప్పనగుంట సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మాదల శ్రీనివాసరావు ఆరుగొలను హైస్కూల్‌ ఎదురుగా ఉన్న నాలుగు సెంట్ల స్థలంలో అయిదేళ్ల కిందట ఈ భవనం నిర్మించారు. అందులో ఆదిత్య ట్రేడర్స్‌ పేరుతో పురుగుమందుల దుకాణం నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సర్వే నంబర్లు 313, 336ల్లో ఉన్న ఈ స్థలం వాగు, రోడ్డు పోరంబోకుగా ఉందని, దీనిని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించినట్లు ఫిర్యాదులు వచ్చాయని  బాపులపాడు తహసీల్దార్‌ నరసింహారావు తెలిపారు. దీంతో సత్వరమే భవనాన్ని తొలగించాలంటూ గత నెల 24న ఒకసారి, ఈ నెల 1న మరోసారి శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేశామని, అయినా స్పందించకపోవడంతో కూల్చివేత చేపట్టామని ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. తనకు ఒక్కసారి కూడా నోటీసివ్వలేదని, మంగళవారం ఉదయం కూల్చివేతకు ముందు దుకాణం గోడకు అతికించారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ స్థలాన్ని తాను చీపురుపల్లి శ్రీనివాసరావు వద్ద కొన్నానని, అప్పటికే నలుగురైదుగురి చేతులు మారిందని, అక్రమ కట్టడమైతే పంచాయతీ పన్ను, విద్యుత్తు కనెక్షన్‌ ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని