DK Shivakumar: అధిష్ఠానానికే ఆపద్బంధువు

సంక్షోభ సమయాల్లో కాంగ్రెస్‌కు ఆపద్బాంధవుడిగా గుర్తింపు పొందిన డి.కె.శివకుమార్‌.. దేశంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకుల్లో ఒకరు.

Updated : 14 May 2023 07:20 IST

కర్ణాటక కాంగ్రెస్‌ విజయంలో సూత్రధారి, పాత్రధారి డీకే

బెంగళూరు: సంక్షోభ సమయాల్లో కాంగ్రెస్‌కు ఆపద్బాంధవుడిగా గుర్తింపు పొందిన డి.కె.శివకుమార్‌.. దేశంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకుల్లో ఒకరు. ఈసారి ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ప్రకటించిన ఆస్తుల విలువే రూ.1200 కోట్ల పైబడింది. 1980ల్లో విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్‌లో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగిన ఆయన.. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలో మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణ అనుచరుడిగా పేరొందారు. సిద్ధరామయ్య, కుమారస్వామి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలోనే కాదు... దేశంలో ఎక్కడైనా పార్టీకి సమస్యల పరిష్కారకర్తగా ఎదిగారు.

అహ్మద్‌ పటేల్‌ను గట్టెక్కించారు

తొలిసారిగా ఆయన పేరు, రాజకీయ చతురత 2002లో అందరి దృష్టిని ఆకర్షించింది. మహారాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ (కాంగ్రెస్‌) అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ బెంగళూరులోని తన రిసార్టుకు తరలించిన డీకే వారం రోజుల పాటు వారందరినీ జాగ్రత్తగా కాపాడారు. తద్వారా దేశ్‌ముఖ్‌ ప్రభుత్వం గట్టెక్కింది. 2017లో ఏకంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం పరువు నిలబెట్టారు డీకే. అహ్మద్‌పటేల్‌ అంటే కాంగ్రెస్‌లో తెలియనివారు ఉండరు. సోనియాగాంధీ రాజకీయ సలహాదారుగా వ్యవహరించిన ఆయన ఎంతో మందికి సీట్లిచ్చారు. గెలిపించారు. అలాంటి అహ్మద్‌ పటేల్‌ ఓటమి అంచున నిలబడితే... నేనున్నానంటూ రంగంలోకి దూకి గెలిపించిన ఘనత డీకేది. 2017లో గుజరాత్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేశారు అహ్మద్‌పటేల్‌. ఎలాగైనా ఆయన్ను ఓడించాలని భాజపా కంకణం కట్టుకుంది. గుజరాత్‌లోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేసింది. పరిస్థితి చూస్తే అహ్మద్‌పటేల్‌ ఓడిపోయేలా కనిపించింది. దీంతో 42 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను డీకే హుటాహుటిన కర్ణాటకకు తరలించి పటేల్‌ను గెలిపించారు. అలా సోనియాగాంధీ, రాహుల్‌లకు తలలోనాలుకలా మారిన శివకుమార్‌పై 2017లో ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. ఆదాయనికి మించి ఆస్తులు కలిగి ఉండటంతోపాటు, హవాలా లావాదేవీల్లో భాగస్వామి అనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. దాడుల్లో రూ.300 కోట్లు స్వాధీనం చేసుకున్నారంటారు. 2019లో హవాలా ఆరోపణలపై ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది కూడా.

జైల్లో ఉన్న సమయంలో... సోనియా స్వయంగా వెళ్లి పలకరించి వచ్చారంటే డీకే ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. బెయిల్‌పై విడుదలైన తర్వాత 2020లో కర్ణాటక కాంగ్రెస్‌ పగ్గాలను డీకేకు అప్పగించారు. క్లిష్టమైన కుల సమీకరణాలతో పాటు భాజపాకు దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో నెగ్గటం అంత సులభం కాదని డీకేకు తెలుసు. అందుకే తెలివిగా భాజపాను ఎదుర్కొంటూ వచ్చారు. తనపై సంధించిన అవినీతి ఆయుధాన్నే కమలనాథులపైకి ప్రయోగించారు. ప్రభుత్వంపై, భాజపా సీఎం బొమ్మైపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. పేటీఎం తరహాలో పేసీఎం అంటూ పోస్టర్లు వేసి... అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు. ఇంతలో గుత్తేదారుల సంఘం ప్రభుత్వంపై 40శాతం కమిషన్‌ అంటూ అవినీతి ఆరోపణలు చేసింది. వీటి వెనక డీకే హస్తం ఉందని అంటారు. అలా భాజపా పేరు బద్నాం కావటంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆయన.. సొంతపార్టీ నుంచి ఉచితాల ప్రకటనలతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. అదే సమయంలో.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేకుండా జాగ్రత్త పడ్డారు. సీఎం కావాలని మనసులో ఉన్నా.. ఆ విషయాన్ని వివాదం చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సర్దుకుపోయారు.

ఎన్నికల్లో పార్టీకి నష్టం కల్గించకుండా... భాజపాకు తమను విమర్శించే అవకాశం ఇవ్వకుండా సిద్ధరామయ్య, తాను ఐక్యంగా ఉన్నట్లు కనిపించారు. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఎక్కడా రాజీ పడకుండా.. గెలుపుగుర్రాలే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఒత్తిళ్లకు లొంగకుండా గట్టిగా నిలబడ్డారు. అధిష్ఠానం నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది. సిద్ధరామయ్యను కూడా రెండోస్థానంలో పోటీ చేయనివ్వకుండా చేయటంలో డీకే కృతకృత్యుడయ్యారు. ఇతర పార్టీల నుంచి కీలకమైన నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకురాగలిగారు. పాత మైసూరులో తన ఒక్కలిగ వర్గాన్ని ఆకట్టుకొని... జేడీ(ఎస్‌) ఓట్లకు గండికొట్టడం ద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీ దిశగా నడిపించారు డీకే! అంతా అయ్యాక... ఎన్నికల ఫలితాలు వెల్లడై... దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే.. తానుమాత్రం ఏడ్చేశారు. ‘‘జైల్లో ఉన్న నన్ను మా అధినేత సోనియా చూడటానికి వచ్చారు. కర్ణాటకలో అధికారాన్ని అందిస్తానని ఆమెకు మాటిచ్చా. ఇవాల్టికి అది తీరింది’’ అంటూ ఆనందబాష్పాలు రాల్చారు. డీకే అలా అనటం వెనక మతలబు లేకపోలేదు. ‘మీకిచ్చిన మాట నేను నెరవేర్చుకున్నా... నా ఆశ (సీఎం కావాలన్న) మీరు తీర్చండని అధిష్ఠానానికి చెప్పకనే చెప్పారు డీకే! మరి తమ ఆపద్బాంధవుడిని అధిష్ఠానం కరుణిస్తుందా? లేక... ఈడీ కేసులున్నాయనో... కులసమీకరణాల పేరుతోనో మళ్లీ పక్కనబెడుతుందా? అనేది  ఆసక్తికర అంశం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని