చినరాజప్ప, నెహ్రూలకు చంద్రబాబు కితాబు

మహానాడు వేదికపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూలను తెదేపా అధినేత చంద్రబాబు అభినందించారు.

Published : 28 May 2023 06:05 IST

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: మహానాడు వేదికపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూలను తెదేపా అధినేత చంద్రబాబు అభినందించారు. వీరిద్దరూ మహానాడులో ఆహార కమిటీ (ఫుడ్‌) సభ్యులుగా సేవలందిస్తున్నారు. మహానాడుకు వచ్చిన పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్‌ అభిమానులకు భోజన ఏర్పాట్లను వీరు పర్యవేక్షిస్తున్నారు. తొలిరోజు శనివారం భోజన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉండడంతో వారిని చంద్రబాబు అభినందించారు. రుచికరమైన ఆహారంతో పాటు తాగునీరు, మజ్జిగ సరఫరా తదితర ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగినట్లు వారు ఆయనకు వివరించారు. రెండో రోజు కూడా ఇలాగే పర్యవేక్షణ, క్రమశిక్షణతో ఆహార పదార్థాలు ఉండేలా చూడాలని చంద్రబాబు సూచించినట్లు చినరాజప్ప తెలిపారు.


కార్యకర్తలకు వైద్య పరీక్షలు

పి.గన్నవరం, గోపాలపురం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు,కార్యకర్తలకు ప్రత్యేకించి న్యూట్రిషన్‌ డైట్‌ ప్లాన్‌ పరీక్షలు చేశారు. ట్రస్టుకు చెందిన 22 మంది ప్రత్యేక వైద్య సిబ్బంది ప్రతి నిధుల సభ, భోజనశాల ప్రాంగణం వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తల ఎత్తు, బరువు వివరాలు నమోదు చేసి వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, తదితర ఆరోగ్య సమాచారాన్ని వారి చరవాణికి పంపిస్తామని ట్రస్టు సిబ్బంది తెలిపారు.


గిరిజన వేషధారణతో సభకు..

మహానాడు ప్రతినిధుల సభకు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నానికి చెందిన తెదేపా నాయకులు పెనకటి శివాజీ, పొలమరశెట్టి వీరరాఘవ గిరిజన వేషధారణతో వచ్చారు. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ఏడు కిలోమీటర్ల దూరాన ద్విచక్రవాహనం పెట్టి కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకున్నామని వారు చెప్పారు.

న్యూస్‌టుడే, సీతానగరం


భోజనాల వద్ద రద్దీ

పి.గన్నవరం, గోపాలపురం, న్యూస్‌టుడే: వేమగిరిలో శనివారం ప్రారంభమైన తెదేపా మహానాడుకు తొలిరోజు తెదేపా నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్‌ అభిమానులు పోటెత్తారు. తొలిరోజు ప్రతినిధుల సభ అని ప్రకటించినప్పటికీ అంచనాలకు మించి జనం తరలివచ్చారు. అయినప్పటికీ ఏమాత్రం కొరత లేకుండా భోజనాలు ఏర్పాటు చేయటం విశేషం. భోజనాలు చేసే ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. తాగునీటి సీసాలు మొదలుకుని అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశారు. ఇటు ఆంధ్ర ప్రదేశ్‌, అటు తెలంగాణ రాష్ట్రాల నుంచేకాక దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి సైతం తెదేపా అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. తొలిరోజు జనస్పందన ఎక్కువగా ఉందని, రెండో రోజు ఆదివారం బహిరంగ సభకు అనూహ్యంగా జనం తరలివస్తారని నాయకులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు