బాబాయిని కలిసిన అబ్బాయి

పార్టీని చీల్చి మహారాష్ట్ర భాజపా కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరిన అజిత్‌ పవార్‌ ఆదివారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కలిశారు.

Published : 17 Jul 2023 03:57 IST

పార్టీని ఐక్యంగా ఉంచాలని అజిత్‌ విజ్ఞప్తి
మౌనంగా చెప్పింది విన్న శరద్‌ పవార్‌

ముంబయి: పార్టీని చీల్చి మహారాష్ట్ర భాజపా కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరిన అజిత్‌ పవార్‌ ఆదివారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కలిశారు. ఆయన వెంట మంత్రులుగా చేరిన వారూ ఉన్నారు. పార్టీని ఐక్యంగా ఉంచాలని తన బాబాయిని అజిత్‌ కోరారని పార్టీ నేత ప్రఫుల్‌ పటేల్‌ వెల్లడించారు. ఆయన చెప్పింది శరద్‌ పవార్‌ మౌనంగా విన్నారని, ఎటువంటి స్పందనా వ్యక్తం చేయలేదని తెలిపారు. బాబాయితో విభేదించి ఈ నెల 2వ తేదీన మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్‌ పవార్‌ చేరిన సంగతి తెలిసిందే. ఆ తరువాత శరద్‌ పవార్‌తో అజిత్‌ భేటీ కావడం ఇదే తొలిసారి. పవార్‌ను కలిసిన వారిలో మంత్రులు హసన్‌ ముష్రిఫ్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, అదితి తత్కారే, దిలీప్‌ వాల్సే ఉన్నారు. శరద్‌ వర్గం నేతలు జయంత్‌ పాటిల్‌, జితేంద్ర అవధ్‌ కూడా వచ్చారు. సమావేశానంతరం అజిత్‌ వర్గం నేత, రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్‌ పటేల్‌ విలేకరులతో మాట్లాడారు. ‘అపాయింట్‌మెంట్‌ లేకుండానే వచ్చి కలిశాం. పార్టీని ఐక్యంగా ఉంచాలని పవార్‌కు విజ్ఞప్తి చేశాం. రానున్న రోజుల్లో తమ గురించి ఆలోచించాలని, గైడ్‌ చేయాలని కోరాం. ఆయన మౌనంగా విని స్పందించలేదు’ అని వివరించారు. శుక్రవారం శరద్‌ సతీమణి ప్రతిభా పవార్‌ను వారి ఇంట్లో అజిత్‌ పరామర్శించారు. ఆమెకు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. 2019లో ఫడణవీస్‌తో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన అజిత్‌ను మళ్లీ ఎన్సీపీలోకి ఆమే తీసుకొచ్చారని చెబుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని