సర్దిచెబుతూ.. చక్కబెడుతూ..

అభ్యర్థుల ప్రకటనకు ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే పనిని భారాస వేగవంతం చేసింది. శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన దగ్గరపడుతుండటంతో ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్న..

Published : 19 Aug 2023 04:15 IST

నేతల మధ్య కలతలు తొలగించే యత్నాలు
అనివార్యమైతే తప్ప.. మార్పులు తక్కువే
అభ్యర్థుల ఖరారుకు భారాస ముమ్మర కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: అభ్యర్థుల ప్రకటనకు ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే పనిని భారాస వేగవంతం చేసింది. శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన దగ్గరపడుతుండటంతో ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్న.. అభ్యర్థులపై అసంతృప్తులు వ్యక్తమవుతున్న నియోజకవర్గాల్లో సమస్యలను సర్దుబాటు చేసే పనిలో పార్టీ నిమగ్నమైంది. ఒక జిల్లాలో ఒక సామాజికవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేను మార్చి అక్కడ అదే సామాజికవర్గానికి ఇవ్వలేకపోతే ఇంకోచోట అయినా ఆ వర్గం అభ్యర్థిని నిలపాల్సి ఉంటుంది. ఇలా ఒకటి మార్చితే దానికి అనుబంధంగా మరికొన్ని మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అనివార్యమైతే తప్ప అభ్యర్థులను మార్చరాదనే అభిప్రాయంతో ఉన్న అధిష్ఠానం.. ముఖ్యనాయకులకు బాధ్యతలు అప్పగించి అందరినీ ఒక తాటిపైకి తెచ్చేప్రయత్నాలను ముమ్మరం చేసింది. తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత, ద్వితీయ శ్రేణి నాయకులతో సరైన సంబంధాలు లేకపోవడం ..ఇలా అన్ని రకాల వ్యతిరేకత ఉన్నవారిని మాత్రమే మార్చాలని పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాల్లో.. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

జగ్గారెడ్డి వస్తారని ప్రచారం..

కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) భారాసలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డికి చెందిన భారాస నాయకులు మంత్రి హరీశ్‌రావును కలిసి జగ్గారెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దని కోరారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన చింతా ప్రభాకర్‌తో పాటు మరికొందరు ఇక్కడి నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. ఆ నాయకులు చెప్పిందంతా విన్న హరీశ్‌రావు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, పార్టీ ఏ నిర్ణయం తీసుకొన్నా కట్టుబడి పని చేయాలని సూచించినట్లు సమాచారం.

జనగామలో ఎవరు?

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జనగామ నియోజకవర్గం నుంచి ముగ్గురు టికెట్‌ రేసులో ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ వర్గం, ఆయనకు అనుకూలంగా మరో వర్గంగా విడిపోయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు ప్రగతిభవన్‌కు కూడా వచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితోపాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. టికెట్‌ ఇవ్వకపోతే ముత్తిరెడ్డి వైఖరి ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశం. కానీ భారాస అభ్యర్థిగా బరిలో దిగబోయేది తానేనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అందరినీ సమన్వయంతో పనిచేయించేలా చూడటానికి భారాస ముఖ్యనాయకులు ప్రయత్నిస్తున్నారు. పక్కనే ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. తనకే టికెట్‌ వస్తుందన్న నమ్మకం ఉందని సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించగా.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చే నియోజకవర్గాల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఉంటుందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. తనకు ప్రజలు ఆశీర్వాదం అందిస్తే నియోజకవర్గ రూపురేఖలు మార్చుతానని ఆయన కూడా అన్నారు. ఒక రకంగా కడియం ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టమవుతోంది. భూపాలపల్లి, డోర్నకల్‌, వరంగల్‌ తూర్పు, మహబూబాబాద్‌ నియోజకవర్గాల్లో కొన్నాళ్ల కిందట పోటీ సమావేశాలు జరిగినా అధిష్ఠానం జోక్యంతో ఇప్పుడు సద్దుమణిగాయి. అభ్యర్థులెవరనేది కూడా అధిష్ఠానం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.


అక్కడక్కడా ‘మార్పు’ డిమాండ్లు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మంథని, రామగుండం, చొప్పదండి నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా పలువురు నాయకులు మాట్లాడుతున్నారు. టికెట్‌ ఇస్తే సహకరించబోమంటూ సమావేశాలు పెట్టుకోవడం, నాయకులను కలవడం జరగ్గా, చొప్పదండి నాయకులతో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఇతర నియోజకవర్గాల నాయకులతో పార్టీలోని ముఖ్యులు చర్చించి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, కోదాడ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్‌లను మార్చాలని ఆయా ప్రాంతాల నాయకులు సమావేశాలు జరిపి.. ముఖ్యనేతలకు విజ్ఞప్తులు కూడా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని