ChandraBabu: ఎన్నికల పొత్తులను కాలమే నిర్ణయిస్తుంది

ఎన్నికల పొత్తులపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది కాలమే నిర్ణయిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. రాజకీయాలు గతిశీలంగా ఉంటాయని, అందువల్ల పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

Updated : 30 Aug 2023 09:29 IST

ప్రత్యేక హోదా కోసమే ఎన్డీయే నుంచి బయటికొచ్చాం
అంతకు మించి విభేదాల్లేవు
తెలంగాణలో ఒంటరిగానే పోటీ
వైకాపా ఆటవిక పాలన నుంచి ఏపీని కాపాడతాం: చంద్రబాబు

ఈనాడు, దిల్లీ: ఎన్నికల పొత్తులపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది కాలమే నిర్ణయిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. రాజకీయాలు గతిశీలంగా ఉంటాయని, అందువల్ల పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల సందర్భంగా దిల్లీకి వచ్చిన చంద్రబాబు మంగళవారం ఇక్కడ జాతీయ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పొత్తులు ఉండబోవని ఇప్పుడు చెప్పి, భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుకున్నా.. అప్పుడు మళ్లీ మీరే ఇదేంటని అడుగుతారని విలేకర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో తాము కేవలం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసమే ఎన్డీయే నుంచి బయటికొచ్చామని, అంతకు మించి భాజపా నేతలతో తమకు విభేదాలేమీ లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. మీతో పొత్తులు పెట్టుకోవడానికి భాజపా సుముఖంగా లేదని వైకాపా నాయకులు అంటున్నారు కదా అని ప్రశ్నించగా అంతర్గతంగా ఏం చర్చలు జరుగుతున్నాయో వారికేం తెలుసన్నారు. ఎన్నికల పొత్తుల గురించి మీడియా ప్రతినిధులు పదేపదే అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మీకు మసాలా కావాలి, నాకు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి అని చమత్కరించారు. విలేకర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఏమన్నారంటే..

ఉత్తర కొరియాలా మారిన ఏపీ

వైకాపా ఆటవిక రాజ్యంతో ఉత్తర కొరియాలా మారిన ఆంధ్రప్రదేశ్‌ను రక్షించడమే మా లక్ష్యం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ సాధించని వృద్ధిరేటుతో ముందుకెళ్లింది. తెలంగాణకు హైదరాబాద్‌ మహానగరం ఉన్నప్పటికీ విభజన తర్వాత ఆర్థిక వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశే ముందడుగు వేసింది. ఇప్పుడు వైకాపా చేసిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర కొరియాలా మారిపోతే, హైదరాబాద్‌ను ఆదరువుగా చేసుకొని తెలంగాణ దక్షిణ కొరియాలా ముందుకెళ్లింది. రాష్ట్ర విభజనకు మించిన విధ్వంసం.. జగన్‌ మోహన్‌రెడ్డి పాలనలో జరిగింది. రాష్ట్రంలో దోపిడీ, దౌర్జన్యాలు, వేధింపులు తప్ప అభివృద్ధి ఊసే లేదు. జగన్‌ పగ, ప్రతీకారాలతో ఏపీకి రాజధాని లేకుండా చేశారు. పోలవరం నిర్మాణం నిలిపేశారు. ఈ దుష్టపాలనకు చరమగీతం పాడాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఇంటికి పోవడం ఖాయం. 

మోదీ వయసు గురించి మాట్లాడే దమ్ముందా జగన్‌?

జగన్‌ ప్రతిసారీ నా వయసు గురించి మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌లకూ నా వయసే ఉంది. వారికి రాని వయసు అడ్డంకి నాకెందుకు వస్తోంది? మోదీ వయస్సు గురించి మాట్లాడే దమ్ము జగన్‌కు ఉందా? వయసుతోపాటు వచ్చిన అనుభవంతో నేను దేశానికి ఎన్నో విధానాలను అందించాను. కేంద్ర, రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల గురించి ఇప్పుడే చెప్పలేం. జగన్‌ గ్రాఫ్‌ రోజురోజుకీ పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేదా అన్నది చూడాలి. తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లేటట్లయితే ఇప్పటికే అసెంబ్లీ రద్దు చేసి ఉండాల్సింది. పొత్తులు తెలుగుదేశానికి కొత్తకాదు. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌, ఎన్డీయే కూటముల్లో మేం కీలకపాత్ర పోషించాం. 

తెలంగాణలో అభ్యర్థుల ఎంపికకు కమిటీ

తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయబోతున్నాం. అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీ వేశాం. దాని సిఫారసు మేరకే నిర్ణయం తీసుకుంటాం. అక్కడ భాజపాతో పొత్తు ఉంటుందా అంటే ఇప్పటికే సమయం మించిపోయింది. ఏపీలో సాధ్యమైనంత ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం. తెదేపాకు చాలా నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులు లేరనడం సరికాదు. ప్రతి నియోజకవర్గంలో టికెట్ల కోసం అభ్యర్థులు క్యూలో ఉన్నారు. మేం గేట్లు తెరిస్తే తెదేపాలో వైకాపా విలీనమైపోతుంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో కాంగ్రెస్‌ పుంజుకొనే అవకాశం లేదు.

జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ ముఖ్యం

ప్రస్తుతం దక్షిణాదిలో జనాభా తగ్గిపోతుంటే, ఉత్తరాదిలో స్థిరత్వానికి వచ్చింది. 2047 వరకు భారత్‌లో యువత ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. అందువల్ల ఇప్పటి నుంచే జనాభా నిర్వహణపై దృష్టి సారించి యువత తగ్గిపోకుండా చూసుకోవాలి. ఇంటికి కచ్చితంగా ఇద్దరు పిల్లలు ఉండాలి. అందుకే ఎంతమంది పిల్లలున్నా చదువుకోవడానికి డబ్బులిస్తామని హామీ ఇచ్చాం. పీపీపీ విధానం వల్ల ధనవంతులు మరింత ధనవంతులయ్యారు తప్ప సామాన్యులకు ప్రయోజనం దక్కలేదు. అందుకే ఇదివరకు ఉన్న 3పీ (పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌)కి తోడు 4 పీ (పబ్లిక్‌, పీపుల్‌, ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌) విధానాన్ని ప్రతిపాదించాం. దీనివల్ల అభివృద్ధిలో ప్రజాభాగస్వామ్యం పెరుగుతుంది. ఇప్పుడున్న రూ.500 నోటును కూడా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశాను. దానివల్ల ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంచే అవకాశం ఉండదు. రాష్ట్రాన్ని బాగు చేస్తూనే దేశ నిర్మాణానికి ఎంతో కొంత చేయూతనివ్వాలన్నది లక్ష్యం. అది ఎలా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. జీఎస్టీ విషయంలో పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత వచ్చింది. కమిటీలు వేసి చర్చించి ఏకాభిప్రాయంతో అమలు చేసిన తర్వాత ఆదాయం అనూహ్యంగా పెరిగింది. నదుల అనుసంధానం వంటి విషయాల్లోనూ అదే పంథా అవలంబించాలి.


వాజ్‌పేయీ, మోదీ.. ఇద్దరూ ఇద్దరే

ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న మీరు వాజ్‌పేయీ, మోదీల్లో ఏం తేడా చూశారన్న ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ ఇద్దరు వ్యక్తులను ఒకరితో ఒకర్ని పోల్చడం భావ్యం కాదన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో టెంపర్‌మెంట్‌ అని పేర్కొన్నారు. వాజ్‌పేయీ దేశంలో మౌలిక వసతుల విస్తరణకు బీజం వేశారని.. జాతీయరహదారులు, విమానాశ్రయాల అభివృద్ధి ఆయన హయాంలోనే ప్రారంభమైందని చెప్పారు. ప్రధాని మోదీ వాటిని ముందుకు తీసుకెళ్తూనే ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ భారతదేశాన్ని బాగా ప్రమోట్‌ చేస్తున్నారని, దానివల్ల విదేశాల్లో ఉన్న భారతీయుల్లో విశ్వాసం పెరిగి మరింత ధైర్యంగా పనిచేయగలుగుతున్నారని విశ్లేషించారు. గతంలో ఏ ప్రధానీ ప్రపంచస్థాయిలో ఇంత బలమైన ముద్ర వేయలేదని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని