PM Modi - Amit Shah: విధేయతకు అగ్రతాంబూలం

ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన భాజపా అక్కడ ముఖ్యమంత్రులుగా ఎవరు ఉండాలనే విషయంలో విధేయతకే పెద్దపీట వేసింది.

Updated : 13 Dec 2023 07:16 IST

మూడు రాష్ట్రాల్లో భాజపా పాటించింది అదే
సీఎంల ఎంపికలో మోదీ-షా ముద్ర

దిల్లీ: ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన భాజపా అక్కడ ముఖ్యమంత్రులుగా ఎవరు ఉండాలనే విషయంలో విధేయతకే పెద్దపీట వేసింది. అదే సమయంలో.. తదుపరి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సామాజిక వర్గం (ఎస్టీ, ఓబీసీ, ఓసీ) వారికి అవకాశం కల్పించినట్లు కనిపిస్తోంది. పాత నాయకులు, అనుభవజ్ఞుల పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ విషయంలో చివరివరకు గోప్యత పాటించి ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), కేంద్ర మంత్రి అమిత్‌షా (Amit Shah) తమ చాతుర్యాన్ని చాటుకున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. పార్టీలో చాలాకాలం నుంచి ఉంటూ విధేయులుగా వ్యవహరిస్తున్నవారికి పట్టం కట్టినట్లయింది. ఏ వర్గంతో అంటకాగకపోవడం వీరిపై అధిష్ఠానం సానుకూలతకు కారణమైంది.

అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వీరి ఎంపికపై నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల్లో బీసీల ప్రభావం ఎక్కువ. వీరందరి దృష్టిని ఆకర్షించేందుకు, బీసీలకు భాజపా సమున్నత స్థానం కల్పిస్తోందన్న సందేశం ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా మధ్యప్రదేశ్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన మోహన్‌ యాదవ్‌కు సీఎం పదవిని భాజపా అప్పగించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌, బిహార్‌లో లాలు ప్రసాద్‌యాదవ్‌లు యాదవ వర్గానికి చెందినవారు. ఈ రెండు రాష్ట్రాలపై వీరి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌కు మోహన్‌యాదవ్‌ను ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది.

మూడు రాష్ట్రాల్లో మూడు వర్గాలకు

భాజపా విజయం సాధించిన మూడు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి సీనియర్‌ నేతలు ఉన్నారు. రాజస్థాన్‌లో వసుంధర రాజె, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ లాంటి హేమాహేమీలను కాదని కొత్తవారికి అవకాశమిచ్చింది. ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాల్లో గిరిజన ఓటర్లు ఎక్కువ. వీరందరికీ భాజపా మద్దతుగా నిలుస్తుందని చెప్పేలా ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విష్ణుదేవ్‌ సాయ్‌ని నియమించింది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ సామాజిక వర్గాన్ని ప్రధానాంశంగా తీసుకుంది. రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో జాట్‌లు, రాజ్‌పూత్‌ల ప్రభావం ఎక్కువ. బ్రాహ్మణులు కూడా కీలకం.

దీంతో- తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్‌లాల్‌ శర్మకు సీఎం పదవి అప్పజెప్పింది. ఆయన ఈ నెల 15న ప్రమాణం స్వీకరించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలను ప్రస్తావించినప్పటికీ, మోదీ పాలన, దేశాభివృద్ధినే ఆయుధాలుగా భాజపా మార్చింది. ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అంతర్గతంగానూ దానిపై అసలు చర్చే నడవకుండా జాగ్రత్త పడింది. ఫలితంగా వర్గ విభేదాలు తలెత్తకుండా చూసుకుంది. ఒక్కో ముఖ్యమంత్రికి ఇద్దరిద్దరు డిప్యూటీలను నియమించింది. వారు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు.

అప్పటివరకు ఓ మూలనే

రాజస్థాన్‌లో సీఎం పేరు ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు తీసిన ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. సీఎం ఎంపిక కోసం అధిష్ఠానం పంపించిన పరిశీలకులతో పార్టీ ఎమ్మెల్యేలు బృందంగా ఫొటో తీసుకున్నారు. అందులో ప్రముఖులు, సీనియర్‌ నాయకులు తొలి వరుసలో కూర్చొంటే భజన్‌లాల్‌ శర్మ మూడో వరసలో ఓ మూలన నిల్చొన్నారు. సీఎం అభ్యర్థిపై కమిటీ సభ్యులు చర్చిస్తున్న సమయంలోనూ ఆయన ఎక్కడో వెనుక వరసలో కూర్చున్నారు. నిమిషాల వ్యవధిలోనే తన పేరును ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో షాక్‌ నుంచి తేరుకునేందుకే ఆయనకు కొద్ది సమయం పట్టిందట. మధ్యప్రదేశ్‌లో విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మోహన్‌ యాదవ్‌ అనతికాలంలోనే పార్టీలో ఉన్నత స్థానానికి ఎదిగారు. ఆయన ఓ చాయ్‌వాలా కుమారుడు.


సీనియర్లకు ఎందుకు ఇవ్వలేదంటే..

కొత్త వ్యక్తులకు సీఎం పదవులు అప్పగించడం వెనుక మరో రహస్యం దాగుంది. పార్టీ సీనియర్‌ నేతల్లో ఎవరికైనా పగ్గాలు అప్పగిస్తే.. మరొకరు చిన్నబుచ్చుకొని, చీలికలు వచ్చే అవకాశాలున్నాయి. అలాంటివి తలెత్తకుండా కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తూ, వారికి మద్దతు ఇవ్వాల్సిందిగా సీనియర్లను కోరింది. సామాజిక, రాజకీయపరమైన కోణాలతోపాటు సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలను కూడా భాజపా పరిగణనలోకి తీసుకుంది. ఎంపికైన ముగ్గురూ సంఘ్‌తో సత్సంబంధాలు ఉన్నవారే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని